ఖమేనీ అంత్యక్రియలకు మోడీ ఎందుకు వెళ్లలేదు? కారణమేంటి?

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఆహ్వానించినప్పటికీ.. భారత్ ఈ స్థాయి ప్రతినిధి బృందాన్ని ఎంపిక చేయడం వెనుక బలమైన వ్యూహాత్మక ఆలోచన ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Update: 2026-07-01 09:57 GMT

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరు కాకపోవడం.. ఆయన స్థానంలో ఒక ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పంపించడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఆహ్వానించినప్పటికీ.. భారత్ ఈ స్థాయి ప్రతినిధి బృందాన్ని ఎంపిక చేయడం వెనుక బలమైన వ్యూహాత్మక ఆలోచన ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ (రిటైర్డ్) నేతృత్వంలోని ప్రతినిధి బృందం భారత్ తరఫున ఈ అంత్యక్రియలకు హాజరవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్‌కు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో టెహ్రాన్, ఖోమ్, మషద్ నగరాలలో జరగనున్న ఈ కార్యక్రమానికి పీఎం మోదీ వెళ్లకపోవడం వెనుక ఉన్న దౌత్య కారణాలపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రోటోకాల్.. చారిత్రక నేపథ్యం

గత ఏడాది ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ స్వయంగా హాజరయ్యారు. అయితే ఈసారి సహాయ మంత్రి స్థాయి ప్రతినిధిని మాత్రమే పంపడం కొందరిని ఆశ్చర్యపరిచింది. కానీ చరిత్రను పరిశీలిస్తే భారత్ తన ప్రోటోకాల్‌ను పెద్దగా మార్చలేదని అర్థమవుతోంది. 1989 నాటి ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ అయతొల్లా రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియలకు కూడా అప్పటి విదేశాంగ మంత్రి పి.వి. నరసింహారావు మాత్రమే భారత ప్రతినిధిగా హాజరయ్యారు. కాబట్టి ప్రస్తుత దేశాధినేత కాకుండా ప్రభుత్వ ప్రతినిధిని పంపడం అనేది భారత సాంప్రదాయ దౌత్య ప్రోటోకాల్‌కు అనుగుణంగానే ఉందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

న్యూఢిల్లీ 'సమతుల్య దౌత్యం'

భారత్ ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో అత్యంత సున్నితమైన దౌత్య సమతుల్యతను పాటిస్తోంది. చమురు దిగుమతులు, భద్రత, ప్రాంతీయ స్థిరత్వం దృష్ట్యా భారత్‌కు ఇరుపక్షాలూ సమాన ప్రాధాన్యత కలిగినవే. ఒకవైపు వ్యూహాత్మక చబహార్ నౌకాశ్రయం అభివృద్ధి ద్వారా ఇరాన్‌తో సుదీర్ఘ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ , అరబ్ గల్ఫ్ దేశాలతో రక్షణ, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో సంబంధాలను భారత్ మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ స్వయంగా వెళ్తే అది అమెరికా లేదా ఇజ్రాయెల్ వంటి వ్యూహాత్మక భాగస్వాములకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.

వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ నిర్ణయం భారత్ అనుసరిస్తున్న "స్ట్రాటజిక్ ఆటానమీ" లేదా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విధానానికి స్పష్టమైన ఉదాహరణ. భారత ప్రధాని స్వయంగా హాజరుకాకపోయినా అధికారిక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపడం ద్వారా ఇరాన్‌కు తగిన గౌరవాన్ని అందించింది. అదే సమయంలో అమెరికా , ఇజ్రాయెల్‌లతో ఉన్న రక్షణ, వ్యూహాత్మక బంధాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడింది. భౌగోళిక-రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ, ఏ ఒక్క కూటమి వైపో పూర్తిగా మొగ్గు చూపకుండా కేవలం జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ భారత్ ముందడుగు వేస్తోంది. ఈ అంత్యక్రియల దౌత్యం కూడా న్యూఢిల్లీ యొక్క సునిశిత, సమతుల్య విదేశాంగ విధానానికి చక్కటి ప్రతిబింబంగా నిలుస్తోంది. అయితే భారత ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనందున, ఈ కారణాలను ప్రస్తుతానికి దౌత్య విశ్లేషణలుగానే చూడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News