గుడివాడ మాట‌: పాద‌యాత్ర‌కు అంత ఎఫెక్ట్ ఉంటుందా ..?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌.. వ‌చ్చే ఏడాది జ‌గ‌న్ చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2026-07-01 09:55 GMT

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌.. వ‌చ్చే ఏడాది జ‌గ‌న్ చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఏడాది జ‌గ‌న్ చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర కూట‌మి స‌ర్కారుకు అంతిమ యాత్ర‌ అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఇక‌, వైసీపీ స‌ర్కారు వ‌చ్చేస్తుంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్య‌ల్లో స్ఫురించింది. దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అంత ఎఫెక్ట్ ఉంటుందా? అనే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. నిజంగానే పాద‌యాత్ర‌తో కూట‌మి స‌ర్కారుకు అంతిమ యాత్ర జ‌రుగుతుందా? అనేది కూడా ప్ర‌శ్న‌గా మారింది.

ఎందుకంటే..

పాద‌యాత్ర ఒక‌సారి చేస్తే ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. గ‌తంలో జ‌గ‌న్‌ తొలిసారి పాద‌యాత్ర చేశారు. పైగా ఒక్క ఛాన్స్ అంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కిలో మీట‌ర్ల‌కు పైగానే పాదయాత్ర చేశారు. అయినా.. కూడా భారీ స్థాయిలో అయితే.. జ‌గ‌న్‌కు మైలేజీ రాలేద‌నే చెప్పాలి. ఎందుకంటే తొలిసారి పాద‌యాత్ర చేసిన‌ప్పుడు.. ఆయ‌న ముఖ్య‌మంత్రి కాదు. పైగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అభిమాన‌గ‌ణం ఆయ‌న‌కు స‌హ‌కరించింది. దీనికితోడు పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ కూడా ఆయ‌న‌కు స‌హ‌క‌రించార‌న్న టాక్ ఉంది. అయినా.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 151 మాత్ర‌మే ద‌క్కించుకున్నారు.

సంఖ్యా ప‌రంగా వైసీపీకి 151 పెద్ద‌ది కావొచ్చు. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌లేరు. కానీ, జ‌గ‌న్ ప‌డిన ప్ర‌యాస ముందు మాత్రం దీనిని త‌క్కువ‌గానే చెప్పాలి. నిజానికి అప్ప‌టి ఊపులో 175కు 175 వ‌చ్చేసినా ఆశ్చ‌ర్య‌పోయే ప‌ని ఉండేది కాదు. అంత‌గా ఆయ‌న క‌ష్ట‌ప‌డ్డారు. పైగా ఆయ‌న మాతృమూర్తి విజ‌య‌మ్మ‌, సోద‌రి ష‌ర్మిల కూడా.. క‌లిసి వ‌చ్చారు. నాటి పాద‌యాత్ర‌తో పోల్చుకుంటే.. ప్ర‌స్తుతం వ‌చ్చే ఏడాది చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర‌కు అంత ఊపు ఉంటుందా ? అంటే క‌ష్ట‌మేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

1) జ‌గ‌న్ పాల‌న‌ను ప్ర‌జ‌లు ఇప్ప‌టికే చూశారు. పైగా.. ఒక అంచ‌నాతోనూ ఉన్నారు. రాజ‌ధాని, పోల‌వ‌రం, కేంద్రంతో సంబంధాలు, ప్ర‌తిప‌క్షం విష‌యంలో అనుస‌రించిన వైఖ‌రి, ధ‌ర‌ల పెరుగుద‌ల‌, చెత్త‌పై ప‌న్ను, ర‌హ‌దారుల తీరు, విద్యుత్ చార్జీల పెంపు వంటివి ఇంకా ప్ర‌జ‌ల నుంచి పోలేదు.

2) కూట‌మిలో కొన్ని చిన్న‌పాటి లుకలుక‌లు ఉన్నా.. చంద్ర‌బాబు - ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బంధం, వారి ప‌నితీరు పై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం ఉంది. వారితో రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంద‌న్న న‌మ్మకం కూడా స‌ర్వేల్లో స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర 2.0 గుడివాడ చెప్పిన‌ట్టుగా ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News