ఏపీఎల్-5 ఫైనల్‌లో హైలైట్‌గా నిలిచిన మంత్రి లోకేశ్: క్రీడాభిమానుల్లో జోష్!
మంగళగిరి వేదికగా జరిగిన ఏపీఎల్ సీజన్-5 క్రికెట్ టోర్నీలో మంత్రి లోకేశ్ సందడి చేశారు. మంగళవారం ఈ టోర్నీ ఫైల్ మ్యాచ్ నిర్వహించగా, మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంగళగిరి వేదికగా జరిగిన ఏపీఎల్ సీజన్-5 క్రికెట్ టోర్నీలో మంత్రి లోకేశ్ సందడి చేశారు. మంగళవారం ఈ టోర్నీ ఫైల్ మ్యాచ్ నిర్వహించగా, మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వతహాగా క్రికెట్ అభిమాని అయిన మంత్రి లోకేశ్ లోకల్ మ్యాచ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి చర్యలే క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తాయని అంటున్నారు. ఇక మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన లోకేశ్ ఏదో మొక్కుబడి తంతుగా కాకుండా, ఆసాంతం క్రీడాకారుల్లో ఉత్తేజం నింపడానికి ప్రయత్నించడమే అందరినీ ఆకట్టుకుందని అంటున్నారు. క్రీడాకారులతో సెల్ఫీలు దిగడమే కాకుండా, ట్రోఫీలతో ఫొటోలు, స్టేడియంలో సందడిగా గడిపి ఏపీఎల్ టోర్నీకి విస్తృత ప్రచారం దక్కేలా మంత్రి వ్యవహరించారని క్రీడాభిమానులు కితాబునిస్తున్నారు.
ముఖ్యంగా రాజధాని అమరావతి పరిధిలో మంగళగిరిలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను క్రీడా కార్యకలాపాలకు ప్రధాన వేదికగా మార్చాలనేది మంత్రి ఆలోచనగా చెబుతున్నారు. స్థానిక శాసనసభ్యుడిగా మంగళగిరిని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా లోకేశ్ ప్రయత్నిస్తున్నారు. రాజధాని పరిధిలో ఉండటం వల్ల మంగళగిరిలో ఇప్పటికే పలు అదనపు సౌకర్యాలు సమకూరుతున్నాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా అందుబాటులోకి వచ్చిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే మంత్రి లోకేశ్ లోకల్ మ్యాచ్ ను సైతం హైలెట్ చేసేలా వ్యవహరించారని అంటున్నారు.
అదే సమయంలో ఏపీఎల్ వంటి టోర్నీల నిర్వహణ రాష్ట్ర పర్యాటక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మంగళగిరిలో మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల ఆ ప్రాంతంలో హోటల్, రవాణా, స్థానిక వ్యాపారాలు పుంజుకోవడమే కాకుండా, నగరం ఒక క్రీడా కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంటున్నారు. ఇక టోర్నీ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ వంటి అగ్ర కథానాయకులు హాజరుకావడం, ముగింపుకు మంత్రి లోకేశ్ రావడం వంటి అంశాలు ఈ లీగ్‌ను జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చాయని అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు కూడా ప్రభుత్వం వినియోగించుకుందని చెబుతున్నారు. ఇక క్రీడాకారులకు కూడా ఏపీఎల్ తో మంచి అవకాశాలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీలకు ఇది తొలిమెట్టుగా నిలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.