ఫైళ్లే కాదు, మనుషుల కష్టాలూ ముఖ్యమే.. సీఎం చంద్రబాబు వినూత్న స్పందన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాతున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా విశేష అనుభవం గడించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాతున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా విశేష అనుభవం గడించారు. రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వాధినేతగా కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా తనలో మానవతా కోణాన్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూ బాధితుల మనసులు గెలుచుకుంటున్నారు. తాజాగా ఓ రైతు కాడెద్దులు మరణిస్తే, వెంటనే స్పందించారు సీఎం. ప్రభుత్వాధినేతగా ఉన్న చంద్రబాబు ఇలాంటి ఘటనపై అధికారులతో మాట్లాడి సరిపెట్టొచ్చు. కానీ, ఆ సంఘటనతో తాను ఎంత భావోద్వేగానికి గురయ్యానో తెలియజేస్తూ సోషల్ మీడియాలో పంచుకున్న అంశమే ఇప్పుడు నెటిజన్లలో హాట్ టాపిక్ అవుతోంది.
కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ అనే రైతుకు చెందిన రెండు ఎడ్లు తుంగభద్ర నదిలో పడి దురదృష్టవశాత్తూ మృతి చెందాయి. ప్రమాదవశాత్తూ చోటుచేసుకున్న ఈ ఘటనతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. ఎద్దులకు బీమా ఉంటే నష్ట పరిహారం వస్తుంది. ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయ సహకారాలు అందించాల్సివస్తే, సంబంధిత అధికారులు చూసుకుంటారు. కానీ, ఈ అంశంలో సీఎం చంద్రబాబు స్పందనే అందరినీ ఆకట్టుకుంది. సాధారణ రైతు ఇంట జరిగిన విషాదంపై సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా చలించిపోయారు. ఈ ఘటనపై ఎక్స్ లో ట్వీట్ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
‘‘పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో కలిచివేసింది. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ... వాటి యజమాని అయిన కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఇప్పటికే ఆదేశించాను. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించాను.’’ అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు సీఎం. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
పరిపాలనా పరమైన బాధ్యతల్లో నిత్యం బిజీగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇలా సామాన్యుల కష్టాలను పంచుకోవడంలోనూ అంతే చొరవ చూపడమే విశేషంగా చెబుతున్నారు. కేవలం విధాన నిర్ణయాలు, ఫైళ్లకే పరిమితం కాకుండా, చిన్న చిన్న ఘటనలపై కూడా ఆయన అత్యంత సున్నితంగా స్పందిస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్నారని అంటున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి అంశాలపై స్పందించిన తీరుపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ కార్యకర్త సత్యనారాయణ పరిస్థితిని పత్రికల్లో చూసిన వెంటనే, సీఎం స్వయంగా ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఆపద సమయంలో పార్టీ, తాను అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని పంపి, గొప్ప మనసును చాటుకున్నారు.
విదేశాల్లో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తం
కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా, విదేశాల్లో చిక్కుకుపోయిన వారి వీడియోలు సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చినప్పుడు, చంద్రబాబు తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు. విదేశీ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరపడం, సంబంధిత మంత్రులను బాధిత కుటుంబాలకు పంపడం ద్వారా వారికి కొండంత అండగా నిలుస్తున్నారు. విశాఖకు చెందిన నేవీ ఉద్యోగి విదేశాల్లో మృతి చెందినప్పుడు, సీఎం చూపిన వేగవంతమైన స్పందన అందరినీ ఆకట్టుకుంది. గతంలో మాదిరిగా అధికారులకు చెప్పి ఊరుకోకుండా, స్వయంగా రంగంలోకి దిగి బాధితులను ఓదార్చడం చంద్రబాబు పనితీరులో వస్తున్న మార్పుగా కనిపిస్తోందని అంటున్నారు. సమస్య చిన్నది అయినా, పెద్దది అయినా బాధితులకు ఎంత ముఖ్యమో గ్రహించి ఆయన స్పందిస్తున్న తీరు, సామాన్యుడికి ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతోందని అంటున్నారు.