వైఎస్ జగన్ కోటరీలో దురంధర్ ఉన్నాడా ?
ఎందుకొచ్చిన ప్రతిపాదన వైసీపీని బూమరాంగ్ చేసే విధంగా ఈ ప్రతిపాదనలు ఏమిటి అన్నది మాత్రం ఫ్యాన్ పార్టీ శిబిరంలోనూ వాడిగా వేడిగా చర్చ సాగుతోంది అని అంటున్నారు.;
వైసీపీలో అసలు ఏమి జరుగుతోంది. కీలకమైన అంశాలలో ఎందుకు స్పష్టత కొరవడుతోంది, రాజధాని వంటి ఏపీకి సంబంధించిన అయిదు కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించిన సెంటిమెంట్ ఇష్యూలో సైతం వైసీపీ ఎందుకు ఇన్ని తడబాట్లు కప్పదాట్లు వేస్తోంది. ఎప్పటికపుడు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ వైసీపీ ఏ వైపున పయనిస్తోంది ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకం లో వస్తున్న చర్చకు కావు, వైసీపీలో కరడుకట్టిన అభిమానులలో సైతం కలుగుతున్న సందేహాలు. లేకపోతే ఏమిటీ మావిగన్ ప్రతిపాదన. ఎందుకొచ్చిన ప్రతిపాదన వైసీపీని బూమరాంగ్ చేసే విధంగా ఈ ప్రతిపాదనలు ఏమిటి అన్నది మాత్రం ఫ్యాన్ పార్టీ శిబిరంలోనూ వాడిగా వేడిగా చర్చ సాగుతోంది అని అంటున్నారు.
జగన్ అంటే ఒక ఇమేజ్ :
నిజానికి జగన్ ని పోరాట యోధుడిగా రాజకీయాల్లో చూస్తారు. ఆయన మీద ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన పోరాట పటిమను అయితే ఎవరూ కాదనలేరు. కొండ లాంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మరీ తనదైన సరికొత్త రాజకీయాన్ని జగన్ క్రియేట్ చేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో 2010 నుంచి ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ఎంచుకున్న దారులు, ఆకాశమే హద్దుగా ఆయన వెనుదిరగని బాట, ఆయన మాట ఆయన తీరు ఇవన్నీ కలసి తెలుగు రాజకీయాల్లో ఒక స్ట్రాంగ్ మాన్ అన్న ఇమేజ్ ని అయితే తీసుకుని వచ్చాయి.
మడమ తిప్పుతూనే :
ఇక జగన్ మార్క్ స్లోగన్ ఒకటి ఉంది. మాట తప్పను, మడమ తిప్పను అని. కానీ ఆయన కీలకమైన అంశాలోనే మడమ తిప్పేస్తున్నారు అన్నది ప్రత్యర్ధుల మాట. వారి విమర్శలను రాజకీయ కోణంలో చూస్తూ పక్కన పెట్టేసినా కూడా అమరావతి రాజధాని విషయంలో పలు సందర్భాలలో జగన్ చెప్పిన మాటలు చేస్తూ వస్తున్న ప్రకటనలు చూస్తే మాట తప్పడం మడమ తిప్పడమూ ఎన్నో సార్లు జరిగిపోతూనే ఉన్నాయి కదా అని అంతా అంటున్నారు. జగన్ 2014లో ఏపీ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో అమరావతి మీద సభలో బిల్లు పెట్టినపుడు ఆయన పూర్తి మద్దతు ఇచ్చారు. ఏకంగా ముప్పై వేల ఎకరాలు కావాలని కూడా ప్రతిపాదించారు.
స్పష్టత ఉందా లేదా :
ఇక 2019 ఎన్నికల ముందు అయితే ఆయన ఏకంగా అమరావతికి సమీపంలో ఇల్లు కట్టుకున్నారు. మేము అమరావతికే మద్దతుగా ఉంటామని కూడా ఆయన పార్టీ నేతల చేత చెప్పించారు. తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అంటూ సరికొత్త ప్రతిపాదన చేశారు. ఇక 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన ఇపుడు మవిగన్ అని మరో ప్రతిపాదన చేస్తున్నారు. ఏపీకి రాజధాని అన్నది ఈ రోజుకీ లేదే అన్న జనాల సెంటిమెంట్ వారి ఆవేదన ఒక వైపు ఉంటే మరో వైపు అమరావతి రాజధాని కోసం రైతులు వేలాది ఎకరాల భూములు ఇస్తే అందులో నిర్మాణాలు ఒక వైపు జరిగిపోతూంటే ఇంకా రాజధాని ఎంపిక దగ్గరే వైసీపీ ఆగిపోవడం అన్నది ఆ పార్టీకి ఈ విషయంలో స్పష్టత ఉందా లేదా అన్న సందేహాలను కలిగిస్తోంది అని అంటున్నారు.
చిత్తశుద్ధితోనేనా :
విపక్షానికి అధికార పక్షానికి సలహాలు సూచనలు ఇచ్చే హక్కు ఉంది. అదే సమయంలో అవి సహేతుకంగా ఉండాలి. అమరావతి అన్నది ఇపుడు చాలా దూరం వెళ్ళిపోయింది అక్కడ అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం అనుకుంటోంది. చట్టబద్ధత కూడా వచ్చేసింది. అలాంటి నేపధ్యంలో అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే కనుక వాటిని చెప్పి సరిదిద్దుకోమని సలహా సూచనలు వైసీపీ ఇవ్వవచ్చు. అలాగే ఏమైనా తమకు తోచిన ఆలోచనలు కూడా పంచుకోవచ్చు. అవినీతి జరిగితే గట్టిగా విమర్శించి వాస్తవాలు బయటపెట్టమని ప్రభుత్వాన్ని నిగ్గదీయనూ వచ్చు. కానీ అమరావతి అని ఒక రాజధాని విషయంలో అందరికీ ఒక స్పష్టత ఉన్న వేళ పన్నెండేళ్ళకు పైగా కాలం గడచిపోయిన సమయంలో మావిగన్ అంటూ ముందుకు రావడమేంటని అంతా ఆశ్చర్యపోతున్న నేపథ్యం అయితే ఉంది.
జనాల్లో పలుచన :
జగన్ ఈ విధమైన ప్రకటనలు చేయడం ద్వారా ఆయన ఇమేజ్ జనాల్లో పలుచన అవుతోంది అని సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. తెర వెనక కోటరీలో ఎవరు ఉండి ఈ తరహా సలహా సూచనలు ఇస్తున్నారో తెలియదు కానీ జగన్ వాటిని మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం ద్వారా అభాసుపాలు అవుతున్నారని అంటున్నారు. ప్రత్యర్ధులు ఎవరూ వైసీపీని ఓడించకుండానే తమేఅ సొంతంగా సెల్ఫ్ గోల్ వేసుకుని వెనక్కి వెళ్ళే పరిస్థితిని తెస్తున్నారు అని అంటున్నారు. అసలు జగన్ కి ఈ తరహా వింత కొత్త సూచనలు ఆలోచనలు ఇస్తున్నది ఎవరు అన్నది కూడా వైసీపీ వీరాభిమానులలో కలుగుతున్న సందేహంగా ఉంది.
టీడీపీ ఏజెంట్లున్నారా :
సరిగ్గా ఇక్కడే చాలా మందికి కలిగే మరో అనుమానం ఏంటి అంటే టీడీపీ నుంచి ఎవరైనా ఏజెంట్లు వైసీపీలో చేరి అధినాయకత్వం వద్ద చనువు పెంచుకుని ఈ విధమైన విచిత్రమైన అమలు కానీ ప్రతిపాదనలు చేయిస్తున్నారా అని అంటున్నారు. ఈ మధ్యనే దురంధర్ మూవీ సూపర్ హిట్ అయింది. అందులో కంటెంట్ చూస్తే ఇండియా స్పైగా వెళ్ళి పాకిస్థాన్ లో ఆపరేషన్ చేస్తూ సొంత దేశానికి హెల్ప్ చేస్తారు. సరిగ్గా అలాంటిది ఏదైనా ప్రత్యర్థి పార్టీ టీడీపీ నుంచి ఏజెంట్లు ఎవరైనా వైసీపీకి దగ్గరై ఈ విధంగా జగన్ చేత ప్రకటనలు చేయిస్తున్నారా అని డౌట్లు అయితే వ్యక్తం చేస్తున్నారు.
ట్రోల్ టాపిక్ గా :
అసలు జగన్ కి డ్రాఫ్ట్ ఎవరు ఇస్తున్నారు అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. మావిగన్ అన్నది ఇపుడు సోషల్ మీడియాలో ట్రోల్ టాపిక్ గా మారిపోయింది మరి జగన్ కి కానీ వైసీపీకి కానీ ఈ తరహా స్టేట్మెంట్స్ ఉపయోగపడతాయా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే మావిగన్ తో వైసీపీకి బూమరాంగ్ అవుతోంది అన్నది పార్టీలో గ్రౌండ్ లెవెల్ లో సాగుతున్న చర్చ. అధినాయకత్వం దీనిని ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.