వెంకటేష్ నాయుడు మీవాడు కాదు మీ వాడే .. ఒకరిపై ఒకరు బురద
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం.. వ్యవహారంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం విచారణ చేస్తు న్న విషయం తెలిసిందే.;
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం.. వ్యవహారంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం విచారణ చేస్తు న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి 43 మందిపై కేసులు నమోదు చేసింది. వీరిలో కీలకమైన నాయకులు, ప్రజాప్రతినిధులను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే.. వాస్తవానికి ఈ కేసు తేలిపోయిందని.. ఇక, మిగిలింది.. వైసీపీ అధినేత జగన్‌ను జైల్లో పెట్టడమేనని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇది నిజమేనని భావించే వారు కూడా ఉన్నారు.
కానీ.. ఈ కేసు ఇప్పుడు అనేక ట్విస్టులకు, మలుపులకు కూడా దారి తీసింది. 11 కోట్ల రూపాయలు దాచిన ప్రాంతాన్ని పట్టిచ్చిన వెంకటేష్ నాయుడు వ్యవహారం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వెంకటేష్‌కు వైసీపీకి సంబంధాలు ఉన్నాయని.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డితో అనుబంధం ఉందని టీడీపీ వర్గం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ మరిన్ని ఫొటోలు వీడియోలను తెరమీదికి తెచ్చింది. దీనిలో టీడీపీ నేతలతో ఆయనకున్న సంబంధాలు బయటపడుతున్నాయని పేర్కొంది.
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతోనూ వెంకటేష్ నాయకుడి కి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ కేసులో 3500 కోట్ల రూపాయల మేరకు కుంభకో ణం జరిగిందని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 60 కోట్ల ఆస్తులను సీజ్ చేయగా.. 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు. ఈ పరంగా చూసుకుంటే.. మిగిలిన 3429 కోట్ల రూపాయల సంగతి తేల్చాల్సి ఉంది. ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
ఇంత కీలక సమయంలో కేసును డైవర్ట్ చేసేలా వెంకటేష్ నాయుడు మీవాడు.. మావాడు.. అంటూ.. ఒకరిపై ఒకరు బురద జల్లు కునే రాజకీయాలకు తెరదీయడం సరైన విధానమేనా? అనేది ప్రశ్న. దీని వల్ల ప్రధాన కేసు విచారణపై ప్రభావం చూపుతోంది. అంతేకాదు.. ఒకవేళ వెంకటేష్ నాయుడు ఒక్కడే దోషి అయితే.. మిగిలిన వారి సంగతేంటి? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పక్షం కొంత తగ్గాల్సి ఉంది. కేసును కేసుగా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే.. మొత్తం కేసు నీరుగారి చివరకు ఏమీ లభించని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు చెబుతున్నారు.