మ‌ద్యం కేసులో మ‌లుపులు.. ఎవ‌రికి మేలు ..!

వైసిపి హయాంలో 3500 కోట్ల రూపాయలు మేరకు దోచుకున్నారని పేర్కొంటున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారం ఇప్పుడు ఎటువంటి మలుపు తిరుగుతుంది.. అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది.;

Update: 2025-09-09 05:07 GMT

వైసిపి హయాంలో 3500 కోట్ల రూపాయలు మేరకు దోచుకున్నారని పేర్కొంటున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారం ఇప్పుడు ఎటువంటి మలుపు తిరుగుతుంది.. అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. దీనికి ప్రధాన కారణం.. ఈ కేసులో కీలక నిందితులు అని పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసిన వారిలో చాలామంది బెయిల్ పై బయటకు వచ్చేస్తున్నారు. అదే సమయంలో ఈ కేసులో అంతిమ `లబ్ధిదారు` అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగిన వైసిపి అధినేత జగన్ వ్యవహారం కూడా మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.

ఆయన జోలికి ఎవరూ వెళ్లే అవకాశం లేదన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుందాం.. లేకపోతే అసలు ఈ కేసులో బలమైన సాక్ష్యాలు లేవా అసలు కుంభకోణ‌మే జరగలేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారింది. ప్రభుత్వం మాత్రం 3500 కోట్ల రూపాయల మేరకు అక్రమాలు జరిగాయని, నిధులు దారిమళ్లాయ‌ని చెబుతోంది. ప్రజల సొమ్మును దోచుకున్నారని, నాసిరకం మద్యాన్ని అంటగట్టి భారీ ఎత్తున సొమ్ము చేసుకున్నారని చెబుతోంది. ఇదే ఆరోపణలతో రంగంలోకి దిగిన సిట్‌ అధికారులు 38 మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు.

అయితే తాజాగా అనేక మందికి బెయిల్ రావడం.. వీరంతా కీలక నిందితులని చెబుతుండటంతో అసలు ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది.. ఏ మేరకు ఇది ముందుకు సాగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అసలు జగన్ జోలికి వెళ్లే అవకాశం కూడా ఇప్పట్లో లేదని తెలుస్తోంది. గడిచిన ఏడాదికి పైగా కాలంగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు... ఇప్పటివరకు అసలు ఆ 3500 కోట్ల వ్యవహారానికి సంబంధించిన కీలక అంశాలను గుర్తించలేకపోయారని విమర్శ కూడా వినిపిస్తోంది.

కేవలం 11 కోట్ల రూపాయలను మాత్రమే ఇటీవల హైదరాబాద్ శివారులోని ఒక ఫాం హౌస్ లో గుర్తించారు. దీనిపై కూడా అనేక చర్చలు నడుస్తున్నాయి. అసలా సొమ్ము తమది కాదని, ఎవరో తెచ్చుకుని అక్కడ దాచుకున్న సొమ్మును తమదిగా చూపిస్తున్నారని వైసీపీ చెప్పటం గ‌మ‌నార్హం. దీనిపై కోర్టు కూడా సిట్ అధికారులను పలు ప్రశ్నలు సంధించడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెర‌మరుగయింది. ప్రస్తుతం ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డిచ‌ కృష్ణమోహన్ రెడ్డిచ‌ బాలాజీ గోవిందప్ప వంటి వారు బయటకు వచ్చారు.

మరో కీలక నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కూడా సానుకూలంగా నిర్ణయం వస్తుందని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో అసలు ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది.. ప్రభుత్వం ఎంతో కీలకంగా తీసుకున్న ఈ కేసు అసలు ఏ మేరకు ముందుకు సాగుతుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ కేసు దాదాపు తెరమరుగవుతుందనే చర్చ‌ బలంగా వినిపిస్తుండడం విశేషం.

Tags:    

Similar News