ఔను.. వారిలో అసంతృప్తి నిజమే!
గత ఎన్నికల తర్వాత.. చాలా మంది నాయకులు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. తమకు నచ్చిన స్కోప్ ఉందనిభావించిన పార్టీల్లో చేరారు.;
గత ఎన్నికల తర్వాత.. చాలా మంది నాయకులు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. తమకు నచ్చిన స్కోప్ ఉందని భావించిన పార్టీల్లో చేరారు. వీరిలో బలమైన నాయకులుగా పేరు తెచ్చుకున్న మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ భాను, కిలారు రోశయ్య, జయమంగళ వెంకటరమణ, పెండెం దొరబాబు వంటివారితో పాటు.. మరికొందరు కూడా ఉన్నారు. ఇక, ఆ తర్వాత.. బయటకు రావాలని అనుకున్న వారు కూడా ఆగిపోయారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
పార్టీలు మారిన వారిలో ఎక్కువ మందిపై పెద్దగా కేసులు ఏమీ లేవు. కేసులు ఉంటే.. వాటికి భయపడి.. వాటి నుంచి రక్షణ కోరుకునేందుకు నాయకులు బయటకు వచ్చారని అనుకోవచ్చు. కానీ, మోపిదేవిపై పెద్దగా రాష్ట్రస్థాయిలో కేసు లేదు. ఉన్నది జగన్ అక్రమాస్తుల కేసుల్లోనే ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు. ఇక, బాలినేని పైనా పెద్దగా కేసులు లేవు. అయినా.. వారు ఎందుకు పార్టీ మారారంటే.. తమకు వైసీపీలో దక్కనిది ఏదో ఇక్కడ దక్కుతుందన్న ఉద్దేశం ఉంది.
కానీ, ఇటు టీడీపీలో కానీ.. అటు జనసేనలో కానీ.. కొత్తగా చేరిన వారికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. వారికి పదవులు దక్కలేదు. ఒక్క సామినేని ఉదయ భానుకు మాత్రం ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్య క్షుడి పదవిని ఇచ్చారు. అయినా.. ఆయనకు సహకరించే వారు కొరవడ్డారు. ఇక, టీడీపీలోకి వచ్చిన వారికి అసలు ఎలాంటి పదవులు దక్కలేదు. ఎందుకంటే.. పార్టీలో ఉన్నవారికే పదవులు దక్కని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జంపింగుల బాధ వర్ణనాతీతంగా ఉంది.
ప్రస్తుతం జనసేన మాట ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఇంటింటికి తిరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో జంపింగులు ఎవరూ పాల్గొనడం లేదు. పైగా వారు ఇంటికే పరిమితం అయ్యారు. ఒక్క ఇదే కాదు.. అసలు పార్టీ తరఫున ఏ కార్యక్రమానికీ శ్రీకారం చుట్టడం లేదు. దీంతో వారంతా అసంతృప్తితో ఉన్నారన్నది పార్టీ సీనియర్లు చెబుతున్నారు. కానీ.. ఇప్పటికిప్పుడు ఉన్నవారికే పదవులు సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వారిని ఎలా సంతృప్తి పరచాలన్న దానిపై చర్చ చేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.