వైసీపీ మాజీ ఎంపీ అరెస్టు.. మాజీ మంత్రి హౌస్ అరెస్టు!

వైసీపీ కీల‌క నాయ‌కుల అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది. గ‌త 15 రోజుల్లో ముగ్గురిని అరెస్టు చేయ‌డం వైసీపీలో క‌ల‌క‌లానికి దారితీసింది.

Update: 2026-08-03 10:27 GMT

వైసీపీ కీల‌క నాయ‌కుల అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది. గ‌త 15 రోజుల్లో ముగ్గురిని అరెస్టు చేయ‌డం వైసీపీలో క‌ల‌క‌లానికి దారితీసింది. కుమారుడి రోడ్డు ప్ర‌మాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ను అరెస్టు చేశారు. టీడీపీ నేత ఇంటిపై దాడి చేసిన కేసులో వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు జైలుకు పంపించారు. తాజాగా అనంత‌పురం జిల్లా హిందూపురం వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అదే స‌మ‌యంలో ఇదే జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి శంకర నారాయణ హౌస్ అరెస్ట్ చేశారు.

ఎందుకు?

తాజా అరెస్టుల వెనుక‌.. వైసీపీ నాయ‌కులు చేప‌ట్టిన నిర‌స‌న‌లే కార‌ణ‌మ‌ని పోలీసులు చెబుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే, బీసీ నేత విరూపాక్షిని అరెస్టు చేయ‌డాన్ని నిర‌సిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఈ క్ర‌మంలో అనంత‌పురంలో నాయ‌కులు సోమ‌వారం రోడ్డెక్కారు. అయితే.. నిర‌స‌న‌ల‌కు అనుమ‌తి లేద‌ని పేర్కొంటూ.. గుంతకల్ సబ్ డివిజన్‌లో పోలీస్ యాక్ట్-30 అమలులోకి తీసుకువ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ నేత‌లు నిర‌స‌న‌కు దిగ‌డంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. పోలీసులు.. త‌మ నిర‌స‌న‌ల‌ను అడ్డుకుంటున్నార‌ని.. ధర్నా నిర్వహిస్తామంటూ ఉర‌వ‌కొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి వీడియో విడుదల చేశారు. దీంతో ఆయ‌న‌ను కూడా హౌస్ అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఇక‌, జిల్లా వ్యాప్తంగా పోలీసులు అద‌న‌పు బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపారు. నిర‌స‌న లు, ధ‌ర్నాల‌కు అనుమ‌తి లేద‌ని పేర్కొన్నారు. అయినా.. బ‌య‌ట‌కు వ‌స్తే.. అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ రించారు. ఇదిలావుంటే.. టీడీపీ నాయ‌కులు కూడా నిర‌స‌న‌ల‌కు దిగారు.

పోటా పోటీగా..

బీసీల‌పై దాడులు చేస్తున్నార‌ని.. వారిని అరెస్టు చేస్తున్నార‌ని ఆరోపిస్తూ.. వైసీపీ నాయ‌కులు నిర‌స‌న‌లు చేప‌ట్ట‌గానే... దీనికి ప్ర‌తిగా టీడీపీ నాయ‌కులు కూడా నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌కు దిగారు. గత ప్రభుత్వంలో బీసీలపై దాడులు జ‌రిగాయ‌ని, చాలా మందిని చంపేశార‌ని ఆరోపిస్తూ.. వాటికి వ్యతిరేకంగా టీడీపీ నేత‌లు నిరసన చేప‌ట్టారు. వీరికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదేస‌మ‌యంలో అనంతపురం జిల్లాలో దేవాలయ భూముల పరిరక్షణకు మరో నిరసన కార్యక్రమాన్ని బీజేపీ చేప‌ట్టింది. ఇలా.. అనంత‌పురంలో సోమ‌వారం మూడు పార్టీల నాయ‌కులు నిర‌స‌న‌కు దిగ‌డంతోపోలీసులు అలెర్ట్ అయ్యారు.

Tags:    

Similar News