మరో వైసీపీ నేతకు అరెస్టు ముప్పు! ఎవరంటే..?

కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలే టార్గెట్ గా పోలీసుల వేట కొనసాగుతోంది.;

Update: 2025-12-26 14:37 GMT

కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలే టార్గెట్ గా పోలీసుల వేట కొనసాగుతోంది. గతంలో బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులతో తాజాగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు వైసీపీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే విపక్షానికి చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అరెస్టు కాగా, ఇప్పుడు గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు పేరు తెరపైకి వచ్చింది. తుళ్లూరు పోలీసుస్టేషన్ లో నమోదైన కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు అరెస్టు భయంతో పరారయ్యారని, ముందస్తు బెయిలు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు మేయరుగా కావటి మనోహర్ నాయుడు ఎన్నికయ్యారు. తుళ్లూరు మండలానికి చెందిన ఓ వ్యక్తికి గుంటూరుకు చెందిన రామకృష్ణయ్య అనే వ్యక్తి అప్పు ఇచ్చినట్లు, 2018లో ఈ వ్యవహారం జరగగా, బాధితుడు అప్పు తీర్చకపోవడంతో 2020 నవంబరులో అప్పటి మేయర్ కావటి మనోహర్ నాయుడు సమక్షంలో సెటిల్మెంట్ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందిందని చెబుతున్నారు. బాధితుడు నీరుకొండ శ్రీనును నిందితుడు రామకృష్ణయ్యతోపాటు మరికొందరు కిడ్నాప్ చేసి అప్పటి మేయర్ అయిన మనోహర్ నాయుడు వద్దకు తీసుకువచ్చారని, ఆయన సమక్షంలో బలవంతంగా ఆస్తులు రాయించుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దాదాపు ఐదేళ్ల క్రితమే ఈ ఘటన చోటుచేసుకున్నా, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఫిర్యాదు చేయలేదని బాధితుడు చెబుతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై కూటమి ప్రభుత్వం రాగానే ఫిర్యాదు చేశానని, తాజాగా తుళ్లూరు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే నిందితులు పరార్ అయినట్లు చెబుతున్నారు. ఈ కేసులో మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు పేరును ఏ6గా నమోదు చేశారు.

కిడ్నాప్, చంపేస్తామని బెదిరింపు, బలవంతంగా ఆస్తులు గుంజుకోవడం, దాడి వంటి నేరాలకు చెందిన అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. దీంతో మాజీ మేయర్ కావటి అరెస్టు గండం ఎదుర్కొంటున్నట్లు న్యాయవాద వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే బాధితులతో రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం మరోవైపు సాగుతోంది. తాజా కేసుతో మాజీ మేయర్ కావటి భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఆరు నెలల క్రితం తన పదవికి రాజీనామా చేసిన కావటి.. అప్పటి నుంచి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కావటి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ లో ఆయనకు వ్యతిరేకంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో పార్టీ నేతలు తనకు అండగా నిలవలేదన్న కారణంగా మాజీ మేయర్ కావటి పార్టీపై కినుక వహించారు. ఇక తాజాగా కేసు నమోదు కావడం, అరెస్టు ముప్పు ఎదుర్కొంటుండటంతో ఆయన విషయంలో వైసీపీ జోక్యం చేసుకుంటుందా? లేక వదిలేస్తుందా? అన్నది కూడా ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News