ఆపరేషన్ వైసీపీ: ఈ జిల్లాపై దృష్టి పెట్టాల్సిందే ..!
వచ్చే ఎన్నికల్లో తమను ప్రజలు గెలిపిస్తారంటూ.. వైసీపీ అధినేత జగన్ పదే పదే చెబుతున్నారు.;
వచ్చే ఎన్నికల్లో తమను ప్రజలు గెలిపిస్తారంటూ.. వైసీపీ అధినేత జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. ఏ విజయమైనా.. ముందస్తు వ్యూహాలు ముఖ్యం. గతంలో టీడీపీ కూడా ముందస్తు వ్యూహంతోనే అడుగులు వేసింది. పార్టీని బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని, వైసీపీ ప్రభుత్వం పెడుతున్న కేసులతో తలెత్తిన భయాన్ని తొలగించేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఇది పార్టీకి కలిసి వచ్చింది. దీనికి యువగళం పాదయాత్ర మరింత బూస్ట్ ఇచ్చింది.
ఈ తరహా వైసీపీ ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలు కావాలన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. కానీ, జగన్ కానీ.. సీనియర్లు కానీ.. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. జిల్లాల వారీగా సమీక్షలు చేయాలని నాయకులు నిర్ణయించినట్టు తెలిసింది. అంటే.. జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.? ఏం చేయాలి? అనే అంశాలపై అధినేత జగన్ దృష్టి పెట్టాలని కోరుతున్న వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో తొలి జిల్లాగా గుంటూరు పేరు వినిపిస్తోంది.
ఎందుకంటే.. ఇది రాజధాని జిల్లా. అమరావతిని వ్యతిరేకించిన దరిమిలా.. మూడు రాజధానులను భుజాని కి ఎత్తుకున్న తర్వాత.. గుంటూరులో వైసీపీ చతికిల పడింది. ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు స్థానంలో అసలు ఇప్పటి వరకు బోణీ కూడా కొట్టలేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి గుంటూరులో మెరు గైన స్థానాలు దక్కించుకునే దిశగా ఇప్పటి నుంచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నాయకులు చెబుతున్నారు. అదేసమయంలో అసెంబ్లీ స్థానాల్లో చురుగ్గాలేని.. సమన్వయ కర్తలను కూడా మార్చేయాలని సూచనలు వస్తున్నాయి.
నాయకులు చెబుతున్నది వాస్తవమే. ఎందుకంటే.. గత ఎన్నికల తర్వాత.. గుంటూరులో వైసీపీయాక్టివిటీ పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో నాయకులు ఎవరూ మీడియా ముందుకు కూడా రావడం లేదు. గురజాల మాజీ ఎమ్మెల్యే తరచుగా వస్తున్నా.. ఆయనకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక, ప్రత్తిపాడు, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, గుంటూరు వెస్టు, తెనాలి, మంగళగిరి ఇలా.. అనేక నియోజకవర్గాల్లో పార్టీ జెండా కనిపించడం లేదు. నాయకుల మాట కూడా వినిపించడం లేదు. దీంతో సమీక్ష చేసి.. నాయకులను మార్చాలని స్థానిక నేతలు కోరుతున్నారు.