జగన్ పుట్టిన రోజు వేడుకల రచ్చ ఇంకా నడుస్తోంది

అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందన్న విషయాన్ని జగన్ వీరాభిమానులు తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చూపించారు.;

Update: 2025-12-27 05:42 GMT

అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందన్న విషయాన్ని జగన్ వీరాభిమానులు తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చూపించారు. ఏపీలో పెద్ద ఎత్తున ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటే.. తెలంగాణలోనూ అక్కడక్కడా చోటు చేసుకున్నాయి. చివరకు హైదరాబాద్ లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల వేళ.. పోలీసులు వారిపై చర్యలు తీసుకునే వరకు విషయం వెళ్లటం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. జగన్ పుట్టిన రోజు సందర్భంగా పొట్టేళ్లను బహిరంగంగా నరికేయటం.. దాని రక్తాన్ని జగన్ ఫోటోలకు అభిషేకం చేయటం మొదలు ఆయన అభిమానులు చేయని రచ్చ లేదు. మరో ఉదంతంలో ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తుంటే.. ఆ శబ్దాలు తనకు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయంటూ ఆసుపత్రిలో ఉన్న గర్బణి చెబితే.. ఆమె కడుపు మీద కాలేసి మరీ ప్రదర్శించిన దాష్టీకం అందరిని షాక్ కు గురి చేసింది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉదంతాలు తెర మీదకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరిగి ఆరు రోజులు గడిచింది.సరిగ్గా చెప్పాంటే ఇవాల్టికి ఏడో రోజు. ఇన్ని రోజుల తర్వాత కూడా ఏపీలో జగన్ పుట్టిన రోజు నాటి రచ్చకు సంబంధించిన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే గూడురు పట్టణంలో చోటు చేసుకుంది. తమ అభిమాన అధినేత పుట్టిన రోజు సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం.. కత్తులతో వీరంగం వేయటం.. పెద్ద ఎత్తున టపాసులతో పాటు.. ఫైర్ టాయిస్ తో హల్ చల్ చేశారు. ఇక్కడితో ఆగని వారు.. తమ వీరోచిత కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

జగన్ ఫ్లెక్సీ వద్ద పొడవాటి కత్తులతో చెలరేగిన వారు.. ఆ తర్వాత ఊళ్లోని రోడ్ల మీద కత్తుల్ని ఊపుతూ హల్ చల్ చేయటం.. కేక్ కట్ చేసి టపాసులు పేలుస్తున్న వీడియోల్ని తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. వీరి అతిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చూస్తుంటే.. జగన్ పుట్టినరోజు రచ్చ ఏపీలో ఇంకెన్నాళ్లు సా..గుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News