మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఫ్యామిలీకి జగన్ భరోసా

ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన వెయ్యి కోట్లకు పైగా భూమికి సంబంధించిన ఒక ఉదంతం గురించి తెలిసిందే.

Update: 2026-06-08 04:42 GMT

ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన వెయ్యి కోట్లకు పైగా భూమికి సంబంధించిన ఒక ఉదంతం గురించి తెలిసిందే. తప్పుడు జీవోలను క్రియేట్ చేయటమే కాదు.. ఆ భూమిని అక్రమ పద్దతిలో సొంతం చేసుకోవటానికి భారీ స్కెచ్ వేయటం.. అది కాస్తా గండిపేట రెవెన్యూ అధికారులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో.. వెయ్యి కోట్లకు పైగా విలువైన భూమికి సంబంధించిన ఈ ఉదంతం వెలుగు చూసింది. ఈ మొత్తం స్కెచ్ లో ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి పాత్ర కీలకంగా ఉన్నట్లుగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.

మొదట పరారీలో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించటం.. ఆ సమయంలో అందరికి అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైనం మీడియా ద్వారా వెలుగు చూసింది. ఓవైపు సైబరాబాద్ పోలీసులు మాత్రం బ్రహ్మనాయుడు కనిపించటం లేదన్న మాట చెప్పిన వేళలో.. అందుకు భిన్నంగా బ్రహ్మనాయుడి వివరాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించకుండాపోవటం.. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయినట్లుగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.

కట్ చేస్తే.. రెండు.. మూడు రోజుల క్రితం పరారీలో ఉన్న బ్రహ్మనాయుడ్ని చెన్నైలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. పద్నాలుగు రోజుల రిమాండ్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా బ్రహ్మనాయుడు కుటుంబానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

అరెస్టు వేళ.. బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా గిరిబాబుతో ఫోన్ చేసి మాట్లాడిన వైఎస్ జగన్.. పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని.. రాజకీయ కక్షతోనే ఇదంతా జరిగినట్లుగా జగన్ పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.తప్పుడు ఆరోపణలు.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని.. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని.. పార్టీ తరఫున అవసరమైన న్యాయ సహాయాన్ని ఇస్తామని బ్రహ్మనాయుడు కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. తీవ్ర ఆరోపణల వేళ.. అందుకు భిన్నంగా ఫోన్ చేసి మరీ బ్రహ్మనాయుడు కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చిన వైనం రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News