దువ్వాడతో తమ్మినేని చెట్టాపట్టాల్.. వైసీపీలో హాట్ డిబేట్

వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది;

Update: 2026-01-26 14:30 GMT

వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా దువ్వాడ పార్టీకి అంటిపెట్టుకునే ఉంటున్నారని అంటున్నారు. ఆయన తీరువల్ల సొంత నియోజకవర్గం టెక్కలిలో పార్టీకి నష్టం జరుగుతోందని స్థానిక నేతలు పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చి సస్పెండ్ చేయించారు. పార్టీ ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దువ్వాడతో దూరంగా ఉంటున్నారు. కానీ, అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం దువ్వాడతో చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇద్దరూ కలిసి ఉమ్మడిగా పలు రాజకీయ పర్యటనలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో పార్టీకి నష్టం కలుగుతోందని పలువురు సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారశైలి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి తీవ్ర ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. కుటుంబ వివాదం రచ్చకు వెళ్లడం, పార్టీ ఆయనను వెనకేసుకు వస్తుందనే ఆలోచన ప్రజల్లో పెరిగిపోవడం వల్ల సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన వల్ల తమకు ఇబ్బందికరంగా ఉందని పార్టీకి చెందిన మహిళా నాయకులు ఫిర్యాదు చేయడం వల్ల వైసీపీ దువ్వాడను పక్కన పెట్టిందని అప్పట్లో చర్చ జరిగింది. అయితే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ కుట్ర చేశారని, వారి వల్లే తాను వైసీపీకి పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి దూరమయ్యాయని దువ్వాడ ఆరోపిస్తూ వస్తున్నారు.

ఈ వివాదం ఎలా ఉన్నప్పటికీ సస్పెన్షన్ ద్వారా పార్టీకి దువ్వాడకు సంబంధం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లు అయింది. అయితే ఇప్పుడు పార్టీ బహిష్కరించిన దువ్వాడతో కలిసి సీనియర్ నేత తమ్మినేని కలిసిమెలిసి తిరగడం, రాజకీయ పర్యటనలు చేస్తుండటం కొత్త చర్చకు దారితీస్తోంది. జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ నాయకత్వాన్ని ఎదిరిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడానికే తమ్మినేని ఇలా చేస్తున్నారా? లేక ఇంకేమైనా సొంత ఏజెండా ఉందా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధాప్యం కారణంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంటు సమన్వయకర్త పదవి నుంచి తప్పిస్తామని, ఆయన ప్లేసులో యువకుడికి అవకాశం ఇస్తామని మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఇటీవల ప్రకటించారు.

అయితే కృష్ణదాస్ ప్రకటనను జిల్లాలోని ఓ సామాజికవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. తమ సామాజికవర్గాన్ని అణచివేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు నేతలు అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఇది పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. దీంతో కృష్ణదాస్ వ్యాఖ్యలను కొట్టివేస్తూ సీతారాం పార్టీ ఇంచార్జిగా కొనసాగుతారని హైకమాండ్ ప్రకటించింది. ఇక్కడితో ఆ వివాదం ముగిసిందని భావించగా, సీతారాం మాత్రం శాంతించినట్లు కనిపించడం లేదు. పార్టీ బహిష్కరించిన దువ్వాడతో టెక్కలి సహా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు స్థానిక నేతలకు సమాచారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో ఒకేరోజున మాజీ మంత్రి ధర్మాన, మాజీ స్పీకర్ తమ్మినేని పర్యటించారు. ఈ ఇద్దరూ వేర్వేరుగా తిరగడంతో పార్టీ నాయకులు గందరగోళాన్ని ఎదుర్కొన్నారు.

తమ్మినేనికి ఒత్తాసు పలికిన ఒక సామాజిక వర్గం నేతలు సైతం టెక్కలిలో ఆయన వెంట తిరిగేందుకు సాహసించడం లేదని అంటున్నారు. కారణం తమ్మినేని వెంట దువ్వాడ ఉండటమే అంటున్నారు. వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత తాను జిల్లా రాజకీయాల్లో సొంతంగా ఎదుగుతానని ధర్మాన సోదరులతోపాటు తన చిరకాల రాజకీయ ప్రత్యర్థులు కింజరాపు కుటుంబాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తానని ఎమ్మెల్సీ దువ్వాడ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయన వైసీపీలో ఒక సామాజికవర్గం నేతలను దువ్వుతున్నారని అంటున్నారు. అయితే పార్టీలో చాలా మంది నేతలు దువ్వాడతో దూరం పాటిస్తుంటే.. సీనియర్ నేత తమ్మినేని మాత్రం దువ్వాడతో స్నేహ బంధం కొనసాగించడమే ఎవరికీ అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా ఎటుదారితీస్తాయోనన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది.

Tags:    

Similar News