బీజేపీకి... వైసీపీ 'కలరింగ్'.. !
బీజేపీ విషయంలో వైసిపి కలరింగ్ ఇచ్చిందా? తమను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయాలని కాంగ్రెస్ నేతలు బ్రతిమాలారంటూ చెప్పిన విషయం కేవలం ప్రచారమేనా?;
బీజేపీ విషయంలో వైసిపి కలరింగ్ ఇచ్చిందా? తమను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయాలని కాంగ్రెస్ నేతలు బ్రతిమాలారంటూ చెప్పిన విషయం కేవలం ప్రచారమేనా? దీని వెనుక అసలు వాస్తవం ఏంటి? నిజంగానే కాంగ్రెస్ పార్టీ వైసీపీని మద్దతు అడిగిందా? అంటే వైసీపీ నాయకులు ఇది నిజమేనని చెబుతుండగా తాజాగా ఈ విషయంలో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తటస్థంగా ఉండే పార్టీలతో తాము ఇప్పటివరకు మాట్లాడలేదని ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాదు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా వైసిపి నాయకులతో తాము ఇప్పటివరకు ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మాట్లాడలేదని మీడియా ముందు చూచాయిగా చెప్పుకొచ్చారు. దీనినిబట్టి వైసిపిని కాంగ్రెస్ పార్టీ సంప్రదించలేదు అన్నది స్పష్టం అవుతుంది. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గెను వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఒకరు కలుసుకోవడం ఆయనతో ఫోటోలు దిగడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆయనతో మాట్లాడారని చెప్పుకొచ్చారు.
కానీ, వాస్తవం ఏంటంటే ఆయన కుమారుడు వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఇచ్చేందుకు మాత్రమే ఖర్గే దగ్గరికి వెళ్లారన్నది వైసిపి నేతల్లోనే జరుగుతున్న చర్చ. ఇక మొత్తంగా చూసుకుంటే వైసీపీని కాంగ్రెస్ అడిగిందని తమకు మద్దతు ఇవ్వాలని తమ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని గాని ఎక్కడా కోరినట్టు అధికారికంగా సమాచారం లేదు. కానీ, వైసీపీ నాయకులు మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. తమను కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీల ఓటు కోరారని వారు చెబుతున్నారు.
నిజానికి ఇదంతా ఒక ప్రచారం మాత్రమే అన్నది టిడిపి నాయకులు కూడా అనుమానిస్తున్నారు. బిజెపికి చేరువ కావడం కోసం, బిజెపి దగ్గర మంచి మార్కులు వేయించుకోవడం కోసం జగన్ వ్యూహాత్మకంగా ఆడిన ఒక రాజకీయ వ్యూహం అని వారు చెబుతున్నారు. దీనిలో వాస్తవం లేదని, కేవలం ఇది ఒక ప్రచారం మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ గతంలోనూ వైసీపీని ఎప్పుడు మద్దతు కోరలేదని ఇప్పుడు మాత్రం ఎందుకు కోరుతుందని ఈ విషయంలో లోతుగా పరిశీలిస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయన్నది వారు చెబుతున్న మాట.
ఎలా చూసుకున్నా బీజేపీని బుట్టలో వేసుకునేందుకు జగన్ పెద్ద డ్రామానే ఆడారు అన్నది టిడిపి నాయకులు చెబుతున్న మాట. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకుల వైపు నుంచి కూడా ఎట్లాంటి స్పందన లేకపోవడం, జగన్ను తాము సంప్రదించమని గానీ వైసిపి నాయకులు ఓటు అడిగామని గాని వారు చెప్పకపోవడం ఈ చర్చకు బలం చేకూరుస్తోంది.