వర్షాకాలం అసెంబ్లీ...వైసీపీకి పన్నీటి జల్లులు !
వైసీపీ కనుక సభకు వస్తే అంతా కలసి ఉమ్మడిగా ఆ పార్టీ మీద పడిపోయేవారు అని అంటున్నారు.;
వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉంటూ వస్తోంది. దాని మీద జనంలో రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి సాధారణంగా అసెంబ్లీకి ఒక రాజకీయ పార్టీగా వైసీపీ వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు తమ ఎమ్మెల్యే ఎక్కడ అని కూడా ఆలోచిస్తారు. ప్రజా సమస్యల ప్రస్తావన కూడా చేయాలని ఆశిస్తారు. అలా వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉండటంతో విమర్శలు అయితే వెల్లువగానే వచ్చాయి. అయితే పదహారు నెలలకు దగ్గర పడుతున్న సమయంలో తాజాగా జరిగిన వర్షాకాల సమావేశాలు అయితే ఒక ఎత్తుగా సాగాయని అంటున్నారు ఇది వైసీపీకి ఫుల్ ఖుషీగా మారింది అని అంటున్నారు.
అంతా కలసి ఉమ్మడిగా :
వైసీపీ కనుక సభకు వస్తే అంతా కలసి ఉమ్మడిగా ఆ పార్టీ మీద పడిపోయేవారు అని అంటున్నారు. అదే నిజం కూడా అని చెబుతున్న వారూ ఉన్నారు. ఎందుకు అంటే మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అంతా కలసి వైసీపీ అయిదేళ్ళ పాలన తప్పులు అంటూ ఏకరువు పెడతారు దాంతో కూటమి వ్యూహాత్మకంగానే వైసీపీని టార్గెట్ చేస్తుంది. ప్రతీ ఇష్యూలోనూ కూటమి వైసీపీని తీసుకుని వస్తుంది జవాబు చెప్పాలని మైక్ అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి అయితే పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో వైసీపీ ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొనేది అని అంటున్నారు. అవన్నీ ఊహించే వైసీపీ సభకు దూరంగా ఉంటోంది అని చెబుతున్నారు.
ఐక్యంగా ఉండాల్సిన చోట :
సాధారణంగా ప్రత్యర్ధి ఉంటే ఐక్యంగా ఉంటారు. అలా ఉన్నట్లుగానైనా కనిపిస్తారు. కానీ ప్రత్యర్థి అయితే లేకుండా పోయారు. సభ అంతా ఏకపక్షమైంది. అంతా వారే ఉన్నారు దాంతో పాతవి కొత్తవి కలిపి సొంత విషయాలు బయటటకు వచ్చాయని అంటున్నారు. అలాగే అసంతృప్తులు అసమ్మతి స్వరాలు కూడా ఓపెన్ అయిపోయాయని అంటున్నారు. ప్రజా సమస్యల పేరుతో తమ అజెండాలను కొంతమంది తీశారు అని అంటున్నారు ఇక బాలయ్య కామినేని ఎపిసోడ్ అయితే మొత్తం రైనీ సెషన్ కి హైలెట్ అని అంటున్నారు. దాంతో ఇవన్నీ వైసీపీకి బాగా కలసి వచ్చాయని ఆ పార్టీ విశ్లేషించుకుంటోంది.
ఒకరి మీద ఒకరుగా :
కూటమి ఎమ్మెల్యేలే ఒకరి మీద ఒకరుగా విమర్శలు చేసుకోవడం నిందించుకోవడం చేయడం ద్వారా ఎంతో కొంత పలుచల అయ్యారని అంటున్నారు. దాంతో అసెంబ్లీ సమావేశాల ద్వారా ఎన్నో అంశాలను జనం ముందు పెట్టి హైలెట్ కావాలనుకున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరిగినా కూడా అవన్నీ కొందరు ప్రజా ప్రతినిధుల తీరుతో కొట్టుకునిపోయాయని అంటున్నారు. దాంతో మొత్తం ఎనిమిది రోజుల పాటు జరిగిన వర్షాల సమావేశాలు అయితే కూటమికి పెద్దగా మైలేజ్ ని ఇవ్వలేకపోయాయని అంటున్నారు
వైసీపీ ఉండాల్సిందేనా :
కూటమి ఎమ్మెల్యేల డైరెక్షన్ మారాలన్నా వారు అంతా కలసి తన ఫోకస్ విపక్షం మీద పెట్టాలన్నా కూడా వైసీపీ సభలో ఉండాల్సిందే అన్నది అయితే వర్షాకాల సమావేశాలు తేటతెల్లం చేశాయని అంటున్నారు. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ అంటోంది అని గుర్తు చేస్తున్నారు. తమాషా చూడడానికి అయినా లేదా కూటమి వర్సెస్ వైసీపీగా సభను నడిపించాలనుకున్నా వైసీపీకి ఏదో విధంగా ఓకే చెప్పి సభకు రప్పిస్తారా అన్నది అయితే చర్చగా ఉంది. ఏది ఏమైనా సభలో తాము లేకపోవడం వల్లనే లాభం అని గుర్తించిన వైసీపీ చలి కాలం సమావేశాల కోసం ఎదురు చూస్తుందా లేక ఏదైనా వ్యూహంతో సభలోకి అడుగుపెడుతుందా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.