సలహాలపై మానిటరింగ్: బాబు నిర్ణయం ..!
వీరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం.. వాటిని ఆచరించడం తెలిసిందే. అయితే.. కొన్ని కొన్ని సలహాలు బెడిసి కొడుతున్నాయన్న చర్చ ఉంది.;
ఒకప్పుడు లెక్కకు మిక్కిలిగా సలహాదారులను నియమించుకున్న వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్.. తప్పులపై తప్పులు చేశారు. మొండిగా ముందుకు సాగారు. ఫలితంగా పార్టీకి, తనకు కూడా ఇబ్బందులు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వైసీపీ రంగులు వేయడం, డాక్టర్ సుధాకర్ వ్యవహారం, ఎంపీ గోరంట్ల మాధవ్ విషయం నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు వరకు కూడా.. అనేక విషయాల్లో సలహాదారులు చెప్పింది విని.. చేతులు కాల్చుకున్నారు. ఆనాడు జగన్ ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా.. ఘటనల కు మాత్రం జగనే బాధ్యుడయ్యారు.
ఒకరకంగా చెప్పాలంటే.. సలహాదారులే వైసీపీని కొంప ముంచారని అంటారు. అప్పటి సీఎంగా జగన్ బ యటకు వస్తే.. చెట్లు నరకడం.. నల్ల డ్రెస్లు వేసుకుని వచ్చిన వారిపై కేసులు పెట్టించడం వంటివి కూడా సాగాయి. ఇదంతా జగన్ మెప్పుకోసం.. కొందరు సలహాదారులు చేసిన పని. కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ.. అనేక మంది సలహాదారులు ఉన్నారు. పైకి పెద్దగా ప్రచారం చేయకపోయినా.. సలహా దారులను మాత్రం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న అనధికార అంచనా ప్రకారం 32 మంది సలహాదారులు ఉన్నారు.
వీరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం.. వాటిని ఆచరించడం తెలిసిందే. అయితే.. కొన్ని కొన్ని సలహాలు బెడిసి కొడుతున్నాయన్న చర్చ ఉంది. ఉదాహరణకు పీ-4 వ్యవహారం కాకరేపింది. దీనివల్ల వచ్చే ఎన్నిక ల నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. దీనికి ఓ కీల క ఆర్థిక వేత్త, ప్రస్తుతం సలహాదారుగా మారిన వ్యక్తి ఇచ్చిన సూచనలే కారణమని అంటున్నారు. అయితే.. ఇది సాధ్యమా? అనేది మాత్రం చంద్రబాబు ఆలోచన చేయకుండానే అమలులోకి తీసుకురావడంపై విమర్శలు వస్తున్నాయి.
అదేవిధంగా.. జిల్లాల విభజన వ్యవహారంకూడా కూటమిలో ఆసక్తిగా మారింది. వాస్తవానికి జిల్లాలను ఇప్పటికిప్పుడు విభజించడం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. కానీ, ఓ కీలక సలహాదారు ఈ ప్రతిపాదన పైకి తెచ్చారు. దీంతో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే. ఈ వ్యవహారంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తుండడంతో ఇక నుంచి సలహాదారులు ఇచ్చే సూచనలు, సలహాలపై మానిటరింగ్ చేయాలని చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారు చెప్పే ప్రతి సలహాకు ఊ.. చెప్పకుండా దీనిపై ఉన్నతాధికారులతో మదింపు చేయాలని భావిస్తున్నారు. మరి ఏమేరకు సలహాదారులు దీనికి ఒప్పుకొంటారో చూడాలి.