జగన్ కి ఛాన్స్ ఇస్తున్న పవన్ ?
అలా వైసీపీకి 11 సీట్లే వచ్చినా 40 శాతం ఓటు షేర్ రావడంతో అదే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అంతా అలాగే గుర్తిస్తున్నారు.;
రాజకీయాల్లో వ్యూహాలే ఎపుడూ ప్రధాన పాత్ర వహిస్తాయి. అంతే కాదు ఈ రోజున పొజిషన్ ని చూసి రిలాక్స్ అయితే రేపటి రోజున ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిఖార్సు అయిన పొలిటీషియన్ అన్న దానికి అసలైన ఉదాహరణ చంద్రబాబు అని చెప్పాలి. ఆయన ఆశ శ్వాస అన్నీ పాలిటిక్స్. ఆయన భారీ విజయం దక్కిందని పొంగిపోయి రిలాక్స్ కారు.
మరో ఎన్నిక గురించి వెంటనే ఆలోచిస్తారు. అలాగే ఓటమి చెందాక కృంగిపోరు. గెలుపు కోసం ఆయన పరుగు ఎక్కడా ఆపరు. ఇలా ఏపీలో చూసుకుంటే మరో రాజకీయ నాయకుడు ఉన్నారా అంటే చెప్పడానికి కష్టమే అనిపిస్తుంది. చంద్రబాబు బోర్న్ పొలిటీషియన్ గా పేర్కొనాలి. ఇక ఏపీలో అధికార పక్షానికి ప్రతిపక్షం తప్పనిసరిగా ఉంటుంది.
అలా వైసీపీకి 11 సీట్లే వచ్చినా 40 శాతం ఓటు షేర్ రావడంతో అదే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అంతా అలాగే గుర్తిస్తున్నారు. దాంతోనే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తామని గట్టిగా జబ్బలు చరుస్తోంది. అంటే ఏపీలో ఇంకా రెండు పార్టీల వ్యవస్థే కొనసాగుతోంది అన్న మాట.
ఇది ఏపీ విభజన నాటి నుంచి అలాగే జరుగుతూ వస్తోంది. ఏపీలో 2014లో టీడీపీ గెలిస్తే వైసీపీ విపక్షంలోకి వచ్చింది. 2019లో వైసీపీ గెలిస్తే టీడీపీ విపక్షం అయింది. 2024లో టీడీపీ కూటమి వచ్చింది. వైసీపీ విపక్షంలో ఉంది. 2029లో మాదే అధికారం అంటోంది.
జనాలకు కూడా ఏపీలో వేరే పొలిటికల్ ఆల్టర్నేషన్ లేకుండా పోతోంది అని అంటున్నారు. నిజానికి ఏపీలో మూడు పార్టీల వ్యవస్థ ఏర్పడుతుంది అని అనుకున్నారు. జనసేన ఆవిర్భావంతో ఆ లోటు తీరుతుంది అని భావించారు.
ఆ పార్టీని పెట్టిన వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన వెండి తెర మీద పవర్ ఫుల్ స్టార్. అశేషమైన అభిమాన గణం ఉన్నవారు. ఇక అలాంటి హీరో రాజకీయాల్లోకి వస్తే ఏముంది అగ్రాసనమే ఆయన సొంతం అనుకునేవారు. ఇక ఒక బలమైన సామాజిక వర్గం ఆయనకు దన్నుగా ఉంది. ఆ సామాజిక వర్గానికి ఏపీలో ముఖ్యమంత్రి పదవిని తమ వారు అధిరోహించాలని ఉంది. పవన్ రూపంలో అది తీరుతుందని భావించింది. కానీ పవన్ 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలు కాగానే పొత్తుల వైపు ఆలోచించారు.
ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందలేనని ఆయన భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. 2024లో బీజేపీ టీడీపీలతో కలసి ఆయన కూటమి కట్టి పోటీ చేసిన 21 సీట్లకు గానూ అన్నీ గెలిచి సత్తా చాటారు. అప్పటికి ఆయన వ్యూహాలు పొత్తు ఆలోచనలూ కరెక్ట్ అయినా అధికారం చేతిలో పడ్డాక తాను ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ తన పార్టీని బలోపేతం చేసుకుని 2029 లో అయినా జనసేన నుంచి ముఖ్యమంత్రిగా తాను ఉండాలని భావిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది.
పవన్ ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే కనుక మరో పదిహేనేళ్ళ పాటు ఏపీకి చంద్రబాబే సీఎం అని. అంటే తాను ఇప్పటప్పట్లో సీఎం కానని ఆ రేసులో లేనని తేల్చేశారు. ఇక ఆయన ఎటూ కూటమిలో ఉంటారు ఏపీ ప్రజలు కూటమిని గెలిపిస్తే బాబు మరోసారి సీఎం అవుతారు. ఒకవేళ కూటమి పాలన బోర్ కొడితే జనాలకు మరో కనిపించే ఆల్టర్నేషన్ కచ్చితంగా వైసీపీనే. అంటే జగన్ ని సీఎం గా మరోసారి తీసుకుని రావడం.
ఏపీ ప్రజలకు ఇంతకంటే వేరే మార్గం పరిష్కారం లేదని అంటున్నారు. నిజానికి చంద్రబాబు పాలన జగన్ పాలన చూసేసిన ప్రజలు 2024 నాటికే కొత్త నాయకత్వం కోరుకున్నారు. కానీ ఏపీలో కూటమి రూపంలో ఆ చాన్స్ ని అంతా కలసికట్టుగా తీసుకున్నారు. దాంతో పెద్ద పార్టీగా టీడీపీకే సీఎం సీటు దక్కింది.
అదే 2029లో చూసుకుంటే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయ పోరు సాగితే మాత్రం అధికార పార్టీ మీద పూర్తి వ్యతిరేకత కాస్తా వైసీపీకే కలసి వస్తుందని అంటున్నారు. మధ్యలో వేరే పార్టీ లేకపోవడం పవన్ తాను సీఎం రేసులో ఇప్పట్లో లేనని చెప్పడం ద్వారా జగన్ కే అవకాశాలు మెరుగుపడ్డాయని అంటున్నారు. మొత్తానికి ఏపీ పాలిటిక్స్ వెరీ క్లియర్. కూటమి కాకపోతే వైసీపీ. జనాలకు ఇంతకు మించిన చాయిస్ లేదు. అదే వైసీపీకి ఒక విధంగా ప్లస్ అవుతోంది అని అంటున్నారు.