వైసీపీకి జగనే బలం...సర్వం
వైసీపీ అన్న ఒక ప్రాంతీయ పార్టీ పదిహేనేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని పదహారవ ఏట అడుగుపెట్టబోతోంది.;
వైసీపీ అన్న ఒక ప్రాంతీయ పార్టీ పదిహేనేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని పదహారవ ఏట అడుగుపెట్టబోతోంది. 2011 మార్చి 12న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆనాడు వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, తోట గోపాల క్రిష్ణ వంటి వారి సమక్షంలో జగన్ వైసీపీని స్థాపిస్తున్నట్లుగా ఒక కీలక ప్రకటన చేశారు. అలా పుట్టిన వైసీపీ ఎన్నో సవాళ్ళను ఎదుర్కోని ఈ రోజుకు ఈ స్థితిలో ఉంది. వైసీపీ పుడుతూనే కడప లోక్ సభ పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికను ఎదుర్కొంది. పార్టీ స్థాపించిన తరువాత కేవలం రెండు నెలలలోనే మేలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ఏకంగా ఐదున్నర లక్షల ఓట్ల భారీ తేడాతో ఎంపీగా గెలిచారు. అలాగే పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ కూడా మంచి మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
మినీ కురుక్షేత్రంగా :
ఆ మరుసటి ఏడాది ఏకంగా 18 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. అలాగే నెల్లూరు ఎంపీ సీటుకు బై పోల్ వచ్చింది. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 18కి గానూ 16ని వైసీపీ గెలుచుకుని ఉమ్మడి ఏపీలో సంచలనం రేపింది. అదే విధంగా నెల్లూరు ఎంపీని భారీ మెజారిటీతో గెలిచింది. అలా పార్టీ పెట్టిన ఏడాదిలోనే ఇద్దరు ఎంపీలు 17 మంది ఎమ్మెల్యేలతో ఉమ్మడి ఏపీలో మూడవ అతి పెద్ద పార్టీగా వైసీపీ నిలిచింది. ఇక 2014లో జరిగిన భీకరమైన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 67 ఎమ్మెల్యే సీట్లను 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అలాగే తెలంగాణ లో ఒక ఎంపీ మూడు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఏపీలో 45 శాతం ఓటు షేర్ ని వైసీపీ సాధించడం గొప్ప విశేషంగా రాజకీయ విశ్లేషకులు చెబుతారు.
అప్రతిహత విజయంతో :
ఇక 2019లో వైసీపీకి లభించిన విజయం అప్రతిహతమైనదిగా అంతా చెబుతారు. ఒంటరిగా పోటీ చేసిన ఒక పార్టీ 151 సీట్లు దాదాపుగా 50 శాతం ఓటు షేర్ ని సాధించడం 22 ఎంపీ సీట్లను పొందడం అంటే అతి పెద్ద రికార్డుగా చూస్తారు. ఇలా వైసీపీ వరస విజయాలు ప్రతీ ఎన్నికకూ ఓట్ల పరంగా సీట్ల పరంగా ఎదుగుతూ పోయిన తీరు అయితే ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో సైతం సంచలనాలుగానే అంతా చూశారు. అదే తీరున వైసీపీ 2024 ఎన్నికల్లఒ ఘోర పరాభవాన్ని అంతా అదే విధంగా సంభ్రమాశ్చర్యంతో వీక్షించారు. వైసీపీ రాజకీయ చరిత్రలో ఇది అతి పెద్ద కుదుపుగా అంతా చెబుతారు. పీక్స్ కి చేరిన విజయాల నుంచి పాతాళానికి జారిన నేపథ్యం ఇది. అయినా సరే వైసీపీ ఓటు బ్యాంక్ మాత్రం 40 శాతానికి తగ్గకపోవడం అన్నది ఆ పార్టీ అసలైన బలాన్ని సూచిస్తోంది.
కర్త కర్మ క్రియ :
ఇక వైసీపీకి కర్త కర్మ క్రియ అన్నీ జగన్ అని వేరేగా చెప్పాల్సింది లేదు, 2009లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న జగన్ తండ్రి మరణాంతరం సొంత రాజకీయ పార్టీ పెట్టి ఒంటరి బాటనే ఎన్నుకున్నారు. ఈ రోజున దేశంలో ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తూ వస్తున్న ఏకైక పార్టీగా వైసీపీకి రికార్డు ఉంది అంటే అది జగన్ రాజకీయంగా ఆయన వ్యూహంగానూ చూడాలని అంటారు.
వ్యూహాలు అన్నీ అక్కడే :
వైసీపీకి సంస్థాగతంగా బలం ఎంత, ఆ పార్టీకి ఉన్న ఇతర బలాలు బలగాలుఎంత అన్న చర్చకు వచ్చినపుడు కొన్ని విషయాలు ఆశ్చర్యంగా ఉంటాయి. మిగిలిన పార్టీల మాదిరిగా వైసీపీలో సభ్యత్వ నమోదు అన్నది పెద్ద కాంపెనియన్ గా చేయడం ఉండదు, పార్టీలో అంతా ఒక సైలెంట్ అది జరిగిపోతుంది. ఇక పదవులు ఎంపిక నియామకాలు అన్నీ అధినాయకుడు జగనే చూస్తారు. పార్టీ విధానాలు వ్యూహాలు అన్నీ కూడా ఆయనే. రెండవ మాట ఉండదు మరో ఆలోచన కూడా ఉండదని చెబుతారు. మరి ఇంతలా ఒక నాయకుడి చుట్టూ కేంద్రీకృతమైన పార్టీ దేశంలో మరొకటి ఉందో లేదో ఎవరికీ తెలియదు. కానీ వైసీపీ మాత్రం ఆ విషయంలో భిన్నమైన పార్టీగానే చూడాల్సి ఉంది.
టీడీపీతో ఢీ కొడుతూ :
టీడీపీ వయసు చూస్తే నాలుగున్నర దశాబ్దాలు. దాని అధి నాయకుడు చంద్రబాబు అనేక రాజకీయ యుద్ధాలలో ఆరి తేరిన నాయకుడు. సంస్థాగత బలంలో టీడీపీని కొట్టే వారు ఎవరూ లేరు. కానీ అలాంటి పార్టీతోనే వైసీపీ ఢీ కొడుతోంది అంటే అది రాజకీయంగా విశేషమే అని చెప్పాలి. చంద్రబాబు వ్యూహాలకు ధీటుగా ఆయన ఎత్తుగడలను తట్టుకుని ఆయనకు ఎదురు నిలిచి ఒక పార్టీని ఇన్నేళ్ల పాటు నడిపించడం అంటే మాటలు అసలు కాదు, కానీ జగన్ మాత్రం తానే అన్నీ అయి వైసీపీని నడిపిస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెబుతారు. బాబు వ్యూహాలు బయటకు కనిపిస్తాయి, జగన్ వ్యూహాలు కనిపించవని, ఆయన సైలెంట్ గానే స్ట్రాటజీస్ డిజైన్ చేసి అమలు చేస్తారు అని అంటారు.
అదే పార్టీకి శ్రీరామ రక్ష :
ఇక మరో విషయం ఏంటి అంటే బాబు పొలిటికల్ స్టైల్ వేరు, జగన్ స్టైల్ వేరు. అయినా ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఏపీ రాజకీయాల్లో తమదైన శైలిలో జనాల్లో ఉన్నాయని అంటున్నారు. జగన్ జనాలను నమ్ముకుంటూ ముందుకు సాగుతారు. ఆయనకు నాయకులు తరువాత విషయంగా చెబుతారు. తనను నమ్మి నడిచే వారితోనే తన పయనం అని ఆయన కచ్చితంగా చెబుతారు. లేని వారితో పని లేదని అంటారు. ఇలా చూస్తే కనుక 16 ఏళ్ల వైసీపీ ప్రస్థానంలో తొలి నుంచి ఉన్న వారు ఎందరు ఉన్నారు అన్నది ఒక ప్రశ్న. అయితే ఎవరూ లేకున్నా వైసీపీ ఓటు బ్యాంక్ అలాగే ఉంది. జగన్ ఇమేజ్ అలాగే ఉంది. అందుకే అదే పార్టీకి శ్రీరామ రక్ష అని నమ్మిన క్యాడర్ వైసీపీలో నిండుగా మొండిగా ఉంటారు. వారికి జగన్ అంటే వీరాభిమానం. అలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనదగిన వారితోనే వైసీపీ కంచుకోట లాంటి టీడీపీని ఢీ కొడుతూ వస్తోంది. భారీ ఓటమి నుంచి కూడా 2029 ఎన్నికల్లో గెలుపు నాదే అని గట్టిగా పిలుపు వినిపిస్తోంది.