కొడుకు, కోడలుతో ప్రేమగా.. విజయమ్మ
వైఎస్సార్ కుటుంబంలో అంతర్గతంగా నెలకొన్న విభేదాలు, ఆస్తుల గొడవలపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ వైఎస్సార్ వర్థంతి నాడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.;
వైఎస్సార్ కుటుంబంలో అంతర్గతంగా నెలకొన్న విభేదాలు, ఆస్తుల గొడవలపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ వైఎస్సార్ వర్థంతి నాడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్‌కి నివాళులర్పించే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన తల్లి విజయమ్మ కలిసి కనిపించారు. అంతకుముందు కూడా వీరిద్దరి మధ్య మాటల్లేవనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సరస్వతి పవర్ కంపెనీ షేర్ల బదలాయింపు విషయంలో జగన్ తన తల్లి, చెల్లి షర్మిళలపై కేసు పెట్టారనే కథనాలు విస్తృతంగా వచ్చాయి.
- వైఎస్సార్ వర్థంతి సందర్భంగా...
ప్రతి ఏటా జరిగే వైఎస్సార్ వర్థంతి కార్యక్రమం ఈసారి కొంత ప్రత్యేకంగా మారింది. వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఎవరికి వారేగా కాకుండా అందరూ కలిసి నివాళులర్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ తన కుమారుడు జగన్‌ను, కోడలు భారతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఈ దృశ్యం వైఎస్ అభిమానులకు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎంతో ఊరటనిచ్చింది. తమ కుటుంబంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవని, అందరూ కలిసే ఉన్నారని విజయమ్మ ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చారు.
- విభేదాలకు ముగింపు పలికిన సంఘటన
గతంలో వైఎస్సార్ జయంతి, మదర్స్ డే వంటి సందర్భాలలో కూడా జగన్ తన తల్లికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో జగన్, విజయమ్మల మధ్య కూడా దూరం పెరిగిందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ రోజు చోటుచేసుకున్న ఈ ఆత్మీయ దృశ్యం ఆ ప్రచారానికి ముగింపు పలికింది. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య కూడా విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చినా, విజయమ్మ భారతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం ఆ పుకార్లను పటాపంచలు చేసింది.
- సోషల్ మీడియాలో సంబరాలు
విజయమ్మ-జగన్ కలసిపోయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే, వైఎస్సార్‌సీపీ నేతలు మాత్రం షర్మిలతో ఉన్న ఆస్తి తగాదాలు పూర్తిగా పరిష్కారమై, ఇద్దరూ కలిస్తేనే అసలైన ఊరట లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతానికి ఈ పరిణామం రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు కొంతవరకు గట్టి సమాధానం ఇచ్చిందని చెప్పవచ్చు. మెల్లగా షర్మిల కూడా అన్నతో సయోధ్యకు వస్తారని, వారిద్దరూ ఒక్కటైతే ప్రత్యర్థుల విమర్శలను మరింత గట్టిగా తిప్పికొట్టవచ్చు అని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.