మాజీ మంత్రి వివేకా కేసులో సంచలనం.. ఇద్దరు పోలీసులపై చర్యలు
పులివెందులకు చెందిన కుళాయప్ప చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఇద్దరు అధికారులపై చర్యలకు దిగారు.;
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కేసులు నమోదు చేసిన అప్పటి ఏఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డిపై పోలీసులు తాజాగా కేసులు నమోదు చేశారు. వివేకా హత్యకు సంబంధించి వీరు తప్పుడు కేసులు నమోదు చేశారని అభియోగాలు నమోదయ్యాయి. పులివెందులకు చెందిన కుళాయప్ప చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఇద్దరు అధికారులపై చర్యలకు దిగారు.
ఏఎస్పీ రాజేశ్వరరెడ్డి రిటైర్ కాగా, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ప్రస్తుతం రాజుపాలెంలో పనిచేస్తున్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై సీబీఐ ఎస్పీ, వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్, వివేకా కుమార్తె, అల్లుడిపై ఈ ఇద్దరు తప్పుడు కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టేసింది. దీంతో పీఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసు తప్పుగా తేలిపోయిందని అంటున్నారు. ఫలితంగా దర్యాప్తు అధికారిని భయపడేలా చేసిన పోలీసులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
2019 మార్చిలో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఈ కేసు రాజకీయంగా పెను సంచలనంగా మారింది. అనేక మలుపులు తిరుగుతోంది. ప్రధానంగా వివేకానందరెడ్డి కుటుంబానికే చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని నిందితులుగా సీబీఐ గుర్తించింది. భాస్కరరెడ్డిని అరెస్టు చేయగా, అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందారు. ఆ తర్వాత కోర్టులో సీబీఐ చార్జిషీటు కూడా దాఖలు చేసింది. అయితే దర్యాప్తు పూర్తి చేయకుండా చార్జిషీటు వేయడంపై హతుడి కుమార్తె సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు కొనసాగించి ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను గుర్తించాలని పట్టుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
సునీత పిటిషన్ తో సీబీఐ దర్యాప్తు కొనసాగించడంపై విచారణ జరుగుతోంది. దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నట్లు సీబీఐ కూడా మెమో దాఖలు చేసింది. ఈ పరిస్థితుల్లో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ కూడా సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుకుంటూ పిటిషన్ దాఖలు చేశాడు. మరోవైపు ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు ఇతర నిందితులు దర్యాప్తును వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తుపై కోర్టు నిర్ణయం వెలువడక ముందే పోలీసు యాక్షన్ ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వివేకా కేసుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తర్జనభర్జన సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఊహించని విధంగా పావులు కదిపిన ప్రభుత్వం పోలీసుల వైపు నుంచే నరుక్కొస్తుందని అంటున్నారు.