మోడీ దత్త పుత్రుడు జగన్.. షర్మిల ధ్వజం

మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు;

Update: 2025-06-20 11:25 GMT

మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రధాని మోడీ దత్తపుత్రుడు.. బీజేపీ మద్దతుతో జగన్ ఎన్నో అరచకాలకు పాల్పడుతున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. జగన్ కు బీజేపీ అన్ని విధాలుగా సహకరిస్తోందని షర్మిల ఆరోపించారు. అందుకే ఆయన ఏమి చేసినా చెల్లుతోందని వ్యాఖ్యానించారు. తన బాబాయ్ వివేకా హత్యతోపాటు అనేక విషయాల్లో జగన్ కు బీజేపీ అండగా నిలుస్తోందని ధ్వజమెత్తారు షర్మిల.

మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. ‘రప్పా.. రప్పా.. నరుకుతాం’ అనే వ్యాఖ్యలను జగన్ సమర్థించడంపై షర్మిల విస్మయం వ్యక్తం చేశారు. ఓ పార్టీ అధినేతగా ఉన్న నాయకుడు అలా మాట్లాడటం సమంజమేనా? అంటూ ప్రశ్నించారు. జగన్ సమాజానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు.

‘మేము నరికేస్తాం.. మేము చంపేస్తాం.. మేం బట్టలూడదీస్తాం.. మేం వెంటపడి కొడతాం’ వంటివి ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావంటూ షర్మిల వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని షర్మిల తెలిపారు. రెండు రోజుల క్రితం మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు ‘రప్పా.. రప్పా..నరుకుతాం’ అనే వివాదాస్పద వ్యాఖ్యలను ప్రదర్శించారు. దీనిపై నిన్న మీడియాతో మాట్లాడిన జగన్ ఈ ప్రభుత్వంలో సినిమా డైలాగ్ చెప్పడం కూడా తప్పేనా? అంటూ వ్యాఖ్యానించారు.

దీంతో రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ‘రప్పా.. రప్పా.. నరకడం’ అన్న వ్యాఖ్యపైనే హాట్ డిబేట్ నడుస్తోంది. అధికార పార్టీ ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. కానీ, వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆ వ్యాఖ్యలను సినిమా డైలాగుగానే చూడాలని సూచించారు. అయితే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ తోపాటు కాంగ్రెస్ చీఫ్ షర్మిల సైతం జగన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ప్రకటనలు చేశారు.

Tags:    

Similar News