షర్మిలకు మొండి చేయి...రాజ్యసభకు నో చాన్స్ !

గత కొద్ది రోజులుగా ఒక ప్రచారం అయితే ఏపీ రాజకీయాల్లో సాగింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్య సభ సీటుని ఇవ్వబోతున్నారు అని.

Update: 2026-06-05 04:10 GMT

గత కొద్ది రోజులుగా ఒక ప్రచారం అయితే ఏపీ రాజకీయాల్లో సాగింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్య సభ సీటుని ఇవ్వబోతున్నారు అని. దాంతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోందని అంతా అనుకున్నారు. అంతే కాదు షర్మిలకి ఇన్నేళ్ళ తరువాత ఒక చట్టసభలో అవకాశం దక్కుతుందని అనుకున్నారు. అది కూడా ఆరేళ్ల పాటు కొనసాగే రాజ్యసభ సీటు అంటే ఆమె రాజకీయ దశ మారిపోతోందని కూడా అంతా భావించారు. కానీ చివరికి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం అయితే ఆమెకు మొండి చేయి చూపించినట్లు అయింది.

వారికే అగ్ర తాంబూలం :

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుండి జూన్ 2026లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో షర్మిల పేరు ఉంటుందని భావించినా ఆమె పేరు లేకుండానే జాబితా రిలీజ్ కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మన్సూర్ అలీ ఖాన్ పవన్ ఖేరాలను కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులుగా నామినేట్ చేసింది. వైఎస్ షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్ధిగా బరిలోకి దిగుతారని మొదట్లోనే బలమైన ఊహాగానాలు చెలరేగాయి. కాంగ్రెస్ నాయకత్వం గతంలో ఈ ఆలోచనకు సానుకూలంగా స్పందించినప్పటికీ, చివరికి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది దాంతో షర్మిల రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాన్ని దక్కించుకోలేకపోయారు అని అంటున్నారు.

మళ్ళీ రెండేళ్ళకే :

ఇదిలా ఉంటే దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేరళతో కలిపితే నాలుగు. మిత్రులతో కొన్ని చోట్ల అధికారం పంచుకున్నప్పటికీ అక్కడ రాజ్య సభ సీట్లు దక్కేది పెద్దగా ఉండదు. ఈ క్రమంలో కాంగ్రెస్ కి దక్కే అతి కొద్ది సీట్లలో పోటీ చూస్తే చాలా భారీగా ఉంటోంది. దాంతోనే షర్మిల వంటి వారికి అవకాశాలను కల్పించలేకపోతున్నారు అని అంటున్నారు. నిజానికి 2024 లోనే షర్మిల రాజ్యసభ సీటు ఆశించారు. కానీ అప్పట్లో ఆమె పార్టీలో చేరి కేవలం ఆరు నెలలు మాత్రమే అయింది కాబట్టి వెనకన బెట్టారు అంటే ఆలోచించవచ్చు. ఈసారి ఆమెకి కచ్చితంగా సీటు దక్కుతుందని అనుకున్నారు. కానీ చివరికి చూస్తే షాక్ ఇచ్చారు. మళ్ళీ రెండేళ్ల వరకూ ఎక్కడా రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యేది లేదు. ఈ లోగా సార్వత్రిక ఎన్నికలు కూడా దూసుకుని వస్తాయి. దాంతో షర్మిల 2029 లో కడప నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలిస్తేనే పార్లమెంట్ కి వెళ్లగలరు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే షర్మిల ఆశలు ఈసారి కూడా నెరవేరకపోవడం మీద చర్చ సాగుతోంది. అయితే కాంగ్రెస్ ఏపీలో పెద్దగా గ్రాఫ్ పెరగకపోవడం వంటి పరిణామాలను కూడా హై కమాండ్ పరిగణనలోకి తీసుకుని తమ పార్టీకి బలంగా ఉన్న చోట అవసరం అయిన చోట అభ్యర్ధులను ఎంపిక చేసింది అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News