వివాహం వెనుక షర్మిల రాజకీయ వ్యూహం ఏంటి ?

ఈ కార్యక్రమానికి షర్మిల సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం గమనార్హం.

Update: 2026-10-07 08:48 GMT

తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి విస్తృతంగా పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల తీరా ఎన్నికల సమయానికి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏపీ రాజకీయాల్లోకి వెళ్లిపోయింది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అక్కడ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి తీసుకుని 2024 లోక్ సభ ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి 1.41 లక్షల ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితం అయింది.

ఆ తర్వాత ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం మీద, అంతకుముందు ఐదేళ్లపాటు ఏపీలో అధికారంలో ఉన్న తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీద తరచుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న ఆస్తుల వివాదం నేపథ్యంలో కుటుంబ పరంగా పెద్దగా సంబంధాలు లేవు.

తాజాగా తన కూతురు వైఎస్ అంజిలిరెడ్డి వివాహం నేపథ్యంలో ఆమె తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటకతో పాటు జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకులను ఈ ఏడాది నవంబర్ 25న జరిగే కూతురి వివాహానికి ఆహ్వానించడంలో బిజీగా ఉంది.

గత సెప్టెంబర్ 24న హైదరాబాద్ శివారు కొత్వాల్ గూడలో జరిగిన షర్మిల కూతురు అంజిలిరెడ్డి, అల్లుడు డాక్టర్ సోమల రఘురాం రెడ్డిల వివాహ నిశ్చితార్థానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి షర్మిల సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం గమనార్హం.

తన సోదరుడు గైర్హాజరు నేపథ్యంలో ‘అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించడం మర్యాద. పెళ్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే ఖర్మ నాకు లేదని ‘ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం పెళ్లికి అయినా వైఎస్ జగన్ వస్తారా ? రారా ? అన్న ఉత్కంఠ నెలకొంది.

పెళ్లికి రావాలని కోరుతూ వైఎస్ షర్మిల దంపతులు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, డీఎంకే కనిమొళి, మాజీ కేంద్ర మంత్రి ఏ.రాజా, ప్రేమలత విజయకాంత్ తదితరులను ఆహ్వానించే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా ఆమె రాజకీయంగా కొంత నిశ్శబ్దం పాటిస్తున్నారు.

కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైఎస్ షర్మిలను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ స్థానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, మాజీ కేంద్ర మంత్రి మన్సూర్ అలీ ఖాన్ లకు అవకాశం కల్పించారు. కూతురు పెళ్లి నేపథ్యంలో జాతీయస్థాయి నేతలతో పాటు, పలువురు సీఎంలను కలుస్తున్న షర్మిల ఈ పరిచయాలను తన రాజకీయ భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగించుకుంటుందా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News