ష‌ర్మిల ఆమ‌ర‌ణ దీక్ష హెచ్చ‌రిక‌లు.. రీజ‌నేంటి?

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబుపై ఆమె ధ్వ‌జ‌మెత్తారు.;

Update: 2025-10-22 16:13 GMT

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబుపై ఆమె ధ్వ‌జ‌మెత్తారు. `ఆమ‌ర‌ణ దీక్ష‌` చేస్తానంటూ హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలోనూ విశాఖ ఉక్కు క‌ర్మాగారం విష‌యంలో ష‌ర్మిల ఆమ‌ర‌ణ దీక్ష అంటూ హడావుడి చేశారు. అయితే.. కేవ‌లం 4 గంట‌ల్లోనే పోలీసులు జోక్యం చేసుకుని ఆమెతో దీక్ష‌ను విర‌మించారు. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ నాలుగు నెల‌ల‌కు తాజాగా ఆమ‌ర‌ణ దీక్ష హెచ్చ‌రిక చేయ‌డం విశేషం.

విష‌యం ఏంటంటే..

రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న `ఆరోగ్య శ్రీ` ప‌థ‌కానికి సంబంధించి కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు నిధులను విడు దల చేయ‌క‌పోవ‌డం గ‌త కొన్నాళ్లుగా వివాదంగా మారింది. కార్పొరేట్ సంస్థ‌ల యాజ‌మాన్యాలు ఇటీవ‌ల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్ర‌మంలో స‌ర్కారుఅనుమ‌తి కోర‌గా.. ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించింది. మ‌రోవైపు ఆరోగ్య శ్రీ సేవ‌ల‌ను ఆయా ఆసుప‌త్రులు నిలిపివేశాయి. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లోని ఆంధ్రరత్న భవన్ వద్ద వైఎస్ షర్మిల రెడ్డి నిరసన చేప‌ట్టారు. బుధ‌వారం రాత్రి 7-8 గంట‌ల మ‌ధ్య అనూహ్యంగా వర్షంలో తడుస్తూ స్టేచర్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ.. `ఆరోగ్య శ్రీ`ని అనారోగ్యశ్రీ గా మార్చారని ఆందోళన వ్య‌క్తం చేశారు. అవ‌స‌ర‌మైతే.. ఆరోగ్య శ్రీ పేరును మార్చుకుని అయినా.. పథకాన్ని కొనసాగించండని సీఎంకు సూచిం చారు. ``నారావారి ఆరోగ్య సేవ`` అని పెట్టుకున్నా త‌మ‌కు అభ్యంతరం లేదన్న ష‌ర్మిల‌.. వెంటనే 2700 కోట్ల రూపాయ‌ల‌ను ఆసుప‌త్రుల‌కు విడుదల చేయాల‌ని పిలుపునిచ్చారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం 2 వేల కోట్ల రూపాయ‌లు బకాయిలు పెట్టింద‌న్న ఆమె.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కూడా అంతే స్థాయిలో బ‌కాయిలు పెట్ట‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

``ఆరోగ్య శ్రీ పథకాన్ని బంద్ పెట్టే కుట్ర జరుగుతోంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని కోమాలో నెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇదెక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. ఆనాడు వైఎస్‌ హయంలో పథకం గొప్పగా సాగింది. పేద ప్రజల పట్ల వైఎస్‌ ప్రేమకు నిదర్శనం ఆరోగ్య శ్రీ పథకం. పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని పథకాన్ని రూపకల్పన చేశారు. వైద్యం కోసం ఆస్తులు అమ్మకూడదు..అప్పుల పాలు కాకూడదు అని ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపొందించారు.`` అని పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ``మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే ఇదేనా మీరు కలిగించే బరోసా?. పేద ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?. ఆరోగ్య భద్రత ఇవ్వని మీరు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు ఉన్నారు?`` అని ష‌ర్మిల నిల‌దీశారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని చంపుతాం అంటే ఊరుకోబోమ‌ని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోతే.. త్వ‌ర‌లోనే ఆమ‌ర‌ణ దీక్ష కు దిగ‌నున్న‌ట్టు ష‌ర్మిల హెచ్చ‌రించారు.

Tags:    

Similar News