ఏపీలో కాంగ్రెస్ కోసం ప్రత్యేక వ్యూహకర్త.. ప్రముఖ స్ట్రాటజిస్టుతో షర్మిల చర్చలు?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.;

Update: 2025-08-15 13:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా అవతరించాలని భావిస్తున్న షర్మిల అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తన లక్ష్యానికి చేరుకోడానికి సరైన వ్యూహరచన ముఖ్యమని భావిస్తున్న షర్మిల పలువురు రాజకీయ వ్యూహకర్తలను సంప్రదించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆమె ప్రయత్నాలకు ఓకే చెప్పడంతో గతంలో కర్ణాటకలో హస్తం పార్టీకి అధికారం దక్కడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్‌ను తన రాజకీయ సలహాదారుగా నియమించాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం ఖుర్షీద్ హుస్సేన్ తో ఆమె కీలక భేటీ నిర్వహించారు. గతంలో ఐప్యాక్‌లో సీనియర్ అసోసియేట్‌గా పని చేసిన ఖుర్షీద్ హుస్సేన్, కర్ణాటక ఎన్నికల్లో '40% టాక్స్ సర్కార్' వంటి సోషల్ మీడియా వ్యూహాలతో బీజేపీ ఓటమిలో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ఖుర్షీద్ హుస్సేన్ 10 కీలక సూచనలు చేశారని చెబుతున్నారు.

వైసీపీ నేతలకు గాలం

రాష్ట్ర విభజనకు పూర్వం ఏపీలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్.. విభజన తర్వాత అడ్రస్ కోల్పోయింది. కాంగ్రెస్ స్థానంలో వైసీపీ బలమైన పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన 99 శాతం మంది నేతలు వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతల్లో అత్యధికం కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. వీరంతా తొలి నుంచి టీడీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన వారే కావడంతో వైసీపీలో బాగా ఇమిడిపోయినట్లు చెబుతున్నారు. పార్టీ జెండా మారినా, అందరి అజెండా ఒక్కటే కావడంతో దాదాపు పదేళ్లుగా వైసీపీలో కుదురుకుని పనిచేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబును వ్యతిరేకించే పార్టీగా వైసీపీకి మించిన ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొందరు సీనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం

ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీలో ఉన్న పలువురు సీనియర్లు ఆలోచన మారిందని, టీడీపీ కూటమిని కొట్టాలంటే వైసీపీ మరింత శక్తి పుంజుకోవాలని వారు సూచిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ ఆలోచన వేరుగా ఉండటంతో కొందరు సీనియర్లు ప్రత్యామ్నాయం ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. అయితే వారికి సరైన నేత కనిపించకపోవడంతో వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాజీ సీఎం జగన్ స్థానంలో టీడీపీకి తానే ప్రత్యామ్నాయం నేతగా ఎదగాలనే ప్రయత్నం చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ ప్రయత్నం చేసినా, వైసీపీలో ఉన్న నేతలు అప్పట్లో షర్మిల వెంట నడిచేందుకు ఇష్టపడకపోవడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల వల్ల జగన్ కు ప్రత్యామ్నాయంగా షర్మిల పోరాడుతున్నారని భావిస్తున్న పలువురు నేతలు.. మీడియాలో ఆమె మాట్లాడుతున్న తీరు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని గుర్తుచేస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఏపీలో అధికారంలోకి రావాలంటే ఇది సరిపోదని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు మారాలని షర్మిలకు పలువురు సీనియర్లు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ వ్యూహకర్తల సలహాలు తీసుకుని ముందడుగు వేయాలని షర్మిల డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.

కర్ణాటకలో గెలిపించిన ఖుర్షీద్ హుస్సేన్

ఈ క్రమంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చిన ఖుర్షీద్ హుస్సేన్ సలహాలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం షర్మిలకు సూచించినట్లు చెబుతున్నారు. ఆయన కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే షర్మిల ఒక్కరి బలం, పోరాటం సరిపోదని, రాష్ట్రంలో పేరున్న కనీసం ఐదుగురు ముఖ్య నేతలను పార్టీలోకి తిరిగి తీసుకురావాలని సూచించినట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం గతంలో తమ పార్టీలో బాగా పనిచేసిన పలువురు నేతలతో చర్చించమని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావును పురమాయించిందని అంటున్నారు. అదేసమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకారం తీసుకోవాలని, తరచూ ఆయనను ఏపీలో తిప్పాలని చెప్పినట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి సహకారం

అదేవిధంగా అమరావతిలో ప్రియాంక గాంధీతో ఒక భారీ బహిరంగ సభ, అవసరమైనప్పుడు తెలంగాణ మంత్రులు ఏపీ నేతలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని షర్మిలకు ఖుర్షీద్ హుస్సేన్ సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రజా సంఘాలతో కలిసి పోరాడాలని, ప్రజలతో మమేకమయ్యేలా సీపీఐ, సీపీఎం నేతలను కలుపుకోవాలని షర్మిలకు సూచించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా షర్మిల విజయవాడలో నిరంతరం అందుబాటులో ఉండేలా ఆమె మకాం మర్చాలని కూడా సూచించినట్లు చెబుతున్నారు. దీంతో షర్మిల కూడా ఈ విషయాలను సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు సమయం ఉండటం, స్థానిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఆధారంగా వైసీపీని మరింత బలహీన పరచి ఆ స్థానంలో ఎదిగేందుకు ప్రయత్నించాలని షర్మిల భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News