'సెల్ఫీ' లీడర్లపై జగన్ సీరియస్.. 60-70 మంది ఇంచార్జుల మార్పు!?
| స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుపై వైసీపీ అధినేత జగన్ సమీక్షిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీకి అండగా నిలవలేదని సుమారు 60 నుంచి 70 నియోజకవర్గాల ఇన్‌చార్జులపై ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయ్యాక వారిని పిలిచి మాట్లాడి, అవసరమైతే బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్‌లో పార్టీలో మార్పులు ఉండొచ్చని చర్చ జరుగుతోంది.
ముందుగా చెప్పినట్లుగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్థానిక ఎన్నికల్లో పార్టీ నేతల పనితీరును ఆయన సమీక్షిస్తున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ నుంచి గట్టి సవాల్ ఎదురైనప్పటికీ పార్టీని ముందుండి నడిపించిన నేతలు ఎవరు? వెనక్కి తగ్గి గడప దాటని నేతలు ఎవరు అన్న సమాచారాన్ని అధినేత జగన్ సేకరిస్తున్నారని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవం అవ్వకూడదని తాను ముందే చెప్పానని, కొన్నిచోట్ల అధికార పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం చేయడం వల్ల నామినేషన్లు వేయలేకపోయామని, కొన్నిచోట్ల అటువంటి పరిస్థితి లేకపోయినా అధికార పార్టీ నేతలతో రాజీ చేసుకుని కొందరు నేతలు ఇళ్లు దాటి బయటకు రాలేదని అధినేతలకు ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు. నామినేషన్లు వేసినా, వేయకపోయినా సమస్యలు ఎదుర్కొన్నది ఎవరు? సమస్యలు ఉన్నాయని నటించింది ఎవరు అన్న అంశాన్ని అధినేత సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొద్దిరోజులుగా పార్టీ నేతల నుంచి స్థానిక ఎన్నికలలో పార్టీ నేతలు, ముఖ్యంగా నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు చూస్తున్న నేతల పనితీరుపై వైసీపీ అధినేత జగన్ రెడ్డి నివేదికలు తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరు ఎలా పనిచేశారన్నదానిపై జగన్ వ్యక్తిగతంగా సమీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. చాలా మంది బాగా పనిచేసి పార్టీ శ్రేణులకు వెన్నుదన్నుగా నిలిచారని, కానీ సుమారు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో మాత్రం నేతలు బయటకు రావడానికి ఇష్టపడలేదని అధినేత దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. తాము అప్పులు చేసి డబ్బులు పెట్టుకుని పోటీకి దిగితే సీనియర్ నేతలుగా ఉన్నవారు కనీస ధైర్యం ఇవ్వకుండా ఇళ్లకే పరిమితమయ్యారని పలువురు నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు పంపినట్లు తెలుస్తోంది.
క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదులను మదింపు చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లిందని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలతో రాజీపడిపోయిన నేతలను గుర్తించి, వారిపై చర్యలకు రంగం సిద్ధం చేయాలని హైకమాండ్ పెద్దలకు అధినేత సూచించారని చెబుతున్నారు. పంచాయతీలతోపాటు 23 పట్టణ సంస్థలకు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ నేతలను పిలిపించి మాట్లాడాలని జగన్ నిర్ణయించుకున్నారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకున్నామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఇంచార్జి పదవుల నుంచి తప్పించనున్నారని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో సుమారు 60 నుంచి 70 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండటంతో జగన్ రెడ్డి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొంటున్నారని అంటున్నారు. ఇంచార్జులు అధికార పార్టీ వారితో రాజీ పడినట్లు నడుచుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నష్టపోయే ప్రమాదం ఉందని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఏ విషయంలోనూ రాజీ పడని నేతలను ఎంపిక చేసి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని మాజీ సీఎం భావిస్తున్నారని అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 80 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు చేసిన వైసీపీ.. ఆ ప్రభావం నుంచి ఇప్పటికీ కోలుకోలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కేడర్ కు సహకరించలేదని ఫిర్యాదులు ఎదుర్కొంటున్న ఇంచార్జులు గతంలో ఇలా అనూహ్యంగా వచ్చిన వారేనని చెబుతున్నారు. ఎక్కువ మంది స్థానికేతర నేతలకు నియోజకవర్గ ఇంచార్జులుగా నియమించడం వల్ల వారు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త నేతల అన్వేషణ మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. మొత్తానికి డిసెంబరు నెలలో వైసీపీలో అంతర్గతంగా చాలా మార్పులు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.