మేయర్లు జెడ్పీ చైర్మన్ల వేతనం ఎంతో తెలుసా ?
| ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రజాప్రతినిధులకు అందే గౌరవ వేతనాలపై చర్చ జరుగుతోంది. వార్డు మెంబర్లకు వేతనం లేకపోగా, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు నెలకు రూ.3 వేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు రూ.6 వేలు అందుతుంది. కార్పొరేటర్లకు రూ.6 వేలు, డిప్యూటీ మేయర్‌కు రూ.20 వేలు, మేయర్‌కు రూ.30 వేలు ఇస్తారు. మరోవైపు చాలా కార్పొరేషన్లలో మేయర్లకు అధికార నివాసాలు లేకపోవడం కూడా సమస్యగా మారింది.
ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల పర్వం జోరుగా సాగుతోంది. ఒక వైపు మిగిలిన అర్బన్ బాడీస్ ఇరవై మూడింటికీ ఈ నెల 26న ఎన్నికలు ఉన్నాయి. అదే సమయంలో ఈ నెల 26, 29, డిసెంబర్ 2న పంచాయతీలకు మూడు విడతలలో ఎన్నికలు ఉన్నాయి. ఇలా మేయర్ నుంచి మొదలుకుని పంచాయతీ వార్డు మెంబర్ల దాకా అన్ని పదవులకూ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ పదవుల మీద ఇంత మోజు ఎందుకు అన్న చర్చ వస్తుంది. ప్రజా సేవ కోసమే అని వెంటనే జవాబు వస్తుంది. అలా అనుకున్నా కోట్లలో ఖర్చు పెడుతూ ఈ పదవులు అందుకుందామని తాపత్రయ పడుతున్న వారు అనేక మంది ఉన్నారు. మరి అంతలా ఖరీదైన ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి గౌరవ వేతనం ఎంత వస్తుందో తెలుసుకోవాల్సిందే.
వారికి వేతనమే లేదు :
ఇక పంచాయతీ వార్డు మెంబర్ల నుంచి మొదలుపెడితే వారికి అసలు గౌరవ వేతనమే లేదు. ఆ తరువాత పంచాయతీ సర్పంచులను తీసుకుంటే వారికి నెలకు మూడు వేల రూపాయలు గౌరవ వేతనం లభిస్తుంది. ఎంపీటీసీలు కూడా అదే మూడు వేల రూపాయలు ఇస్తారు. జెడ్పీటీసీలకు ఆరు వేల గౌరవ వేతనం ఉంటే ఎంపీపీలకు ఆరు వేలు ఇస్తారు. ఇక జెడ్పీ చైర్ పర్సన్ కి నాలుగు వేల రూపాయల గౌరవ వేతనం దక్కుతుంది. కార్పొరేషన్ లో కార్పోరేటర్లకు ఆరు వేల రూపాయలు వేతనం దక్కుతుంది. డిప్యూటీ మేయర్ కి ఇరవై వేలు ఇస్తే మేయర్ కి 30 వేల రూపాయలు ఇస్తారు.
జెడ్పీ చైర్ పర్సన్లకే చాన్స్ :
ఇక ఏపీలో ఉమ్మడి పదమూడు జిల్లాలలో జెడ్పీ చైర్ పర్సన్లకు అధికార నివాసాలు ఉన్నాయి. అదే సమయంలో కొత్తగా ఏర్పడిన 15 జిల్లా పరిషత్తులకు మాత్రం లేవని అంటున్నారు. అలాగే ఏపీలో ఉన్న 17 కార్పోరేషన్ల మేయర్లకు కూడా అధికార నివాసాలు లేవని అంటున్నారు. అంతాకా ఎందుకు విశాఖ వంటి పెద్ద కార్పొరేషన్ కి మేయర్ గా పనిచేసే వారికి అధికార భవనాలు లేకపోవడంతో ప్రజలు వారిని కలిసేందుకు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది అని అంటున్నారు.
అధికార నివాసాలు కొరత :
రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో చాలా వరకు మేయర్లకు ప్రత్యేకంగా ప్రభుత్వ అధికార బంగ్లాలు లేకపోవడం వల్ల ప్రజలకే ఇబ్బంది అవుతోంది అని అంటున్నారు. అయితే కొంతలో కొంత గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ వంటి కొన్ని పెద్ద కార్పొరేషన్లలో గతంలో క్యాంప్ ఆఫీసులు ఉన్నప్పటికీ, మెజారిటీ కార్పొరేషన్లలో మేయర్లు తమ సొంత నివాసాల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అధికార నివాసాలు లేని మేయర్లు చైర్‌పర్సన్లకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం తరఫున ఇంటి అద్దె భత్యం లేదా క్యాంప్ ఆఫీసు నిర్వహణ ఖర్చులను చెల్లిస్తారు. ఇక చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరియు కొత్త జెడ్పీల చైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు వసతి కార్యాలయాల కేటాయింపు అనేది ప్రభుత్వానికి ఒక కీలక అంశంగా మారింది. కీలక పదవులలో ఉన్న వారికి అధికార బంగ్లాలు కేటాయిస్తే ప్రజలు అక్కడికి వెళ్ళి అయినా తమ సమస్యలు చెప్పుకుంటారు అని అంటున్నారు.