వృద్ధ భారతం... దక్షిణాదికే భారం
| భారత్‌లో వృద్ధుల జనాభా వేగంగా పెరగనుంది. 2036 నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 23 కోట్లకు చేరుతుందని అంచనా. జనాభాలో వారి వాటా 14.9 శాతానికి పెరగనుంది. తెలంగాణలోనూ వృద్ధుల వాటా 17.1 శాతానికి చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమానికి డే కేర్ సెంటర్లు, వృద్ధాశ్రమాల ఏర్పాటుతో పాటు సంరక్షణ కోసం యువతకు శిక్షణ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది.
ఏ దేశం అయినా అభివృద్ధి చెందాలంటే పనిచేసే వారు ఉండాలి. మానవ వనరులే దేశ ప్రగతికి దారి తీస్తాయి. యువ శక్తి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆయా దేశాలు ముందుకు సాగుతాయి. భారత్ విషయం తీసుకుంటే ఈ రోజుకు యువ జనాభా యాభై నుంచి అరవై కోట్లుగా ఉంది అని అంటున్నారు. అయితే భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరుగుదలపై అంచనాలు ఉన్నాయి. వారి శాతం పెరిగితే అది దేశానికి భారంగానే ఉంటుందని అంటున్నారు.
పెద్దలతో నిండిపోయి :
ప్రస్తుతం అయితే యువతరంతో కలకలలాడుతున్న దేశం మరో పదేళ్ళలో వృద్ధ భారతంగా మారబోతోంది అని అంటున్నారు. భారతదేశంలో 2036 నాటికి 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల జనాభా దాదాపు 23 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2011లో దాదాపు 10 కోట్లుగా ఉన్న సీనియర్ సిటిజన్ల సంఖ్య పాతికేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరగనుంది అన్న అంచనాలే కలవరపెడుతున్నాయి. దీంతో మొత్తం జనాభాలో వృద్ధుల వాటా పెరుగుదల ఎక్కువగా ఉండబోతోంది. దేశ జనాభాలో వృద్ధుల వాటా 2011లో 8.4 శాతం ఉండగా 2036 నాటికి అది 14.9 శాతానికి చేరబోతోంది. అంటే దాదాపు ప్రతి ఏడుగురిలో ఒకరు వృద్ధుడిగా ఉంటారు అన్న మాట.
కారణాలు ఇవే :
ఈ రోజున యువత పెళ్ళిళ్లకు దూరంగా ఉంటోంది. అంతే కాదు పిల్లలు కూడా పుట్టడం లేదు. లేటు వయసులో వివాహాలు కూడా దానికి మరో కారణంగా ఉంటున్నాయి. అలా చూస్తే రానున్న దశాబ్ద కాలంలో పిల్లల జనాభా తగ్గుదల గణనీయంగా ఉండబోతోంది అని అంటున్నారు. అలాగే సంతానోత్పత్తి రేటు తగ్గడం వల్ల 15 ఏళ్లలోపు పిల్లల జనాభా నిష్పత్తి 2011లో ఉన్న 30.9 శాతం నుండి 2036 నాటికి 20.1 శాతానికి పడిపోనుంది అని గణాంకాలు తెలియచేస్తున్నాయి. అంతే కాదు భవిష్యత్ అంచనాలు చూస్తే ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం 2046 నాటికి భారతదేశంలో పిల్లల కంటే వృద్ధుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. 2050 నాటికి వృద్ధుల జనాభా 31.9 కోట్లకు అంటే మొత్తం జనాభాలో దాదాపు 20 శాతంగా చేరనుంది.
దక్షిణాదిన వృద్ధులే :
భారత దేశం అంతటా వృద్ధ జనాభా ఒకే తీరుగా ఉండదని అంటున్నారు. ఉత్తరాది తో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో వృద్ధుల జనాభా ఎక్కువ ప్రభావం చూపనుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా వృద్ధుల జనాభా పెరగనుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఉదాహరణగా తీసుకుంటే 2036 నాటికి కేరళలో 23 శాతం, తెలంగాణలో 17.1 శాతం మంది వృద్ధులు ఉంటారని అంచనా. వృద్ధులు ఎందుకు పెరుగుతారు అంటే మెరుగైన వైద్య సదుపాయాల వల్ల ఆయుర్దాయం పెరగడం అలాగే జననాల రేటు తగ్గిపోవడం అని అంటున్నారు.
వృద్ధుల సంక్షేమానికి :
ఈ నేపధ్యంలో రానున్న పదేళ్ల కాలంలో వృద్ధుల జనాభా అధికం అవుతుందని భావిస్తున్న కేంద్రం వృద్ధుల సంక్షేమానికి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఒప్పందం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న వృద్ధుల సంక్షేమాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మధ్య కీలక అవగాహన ఒప్పందం తాజాగా కుదిరింది. న్యూఢిల్లీలో తజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దీంతో కంటోన్మెంట్ ప్రాంతాల్లో డే కేర్ సెంటర్ల ఏర్పాటు చేయనున్నారు. అలాగే అటల్ వయో అభ్యుదయ యోజన కింద నిధులు కూడా కేటాయించాలని చూస్తున్నారు. వృద్ధుల సంరక్షణ కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. అలాగే ప్రతీ జిల్లాలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు.