హానీమూన్ పీరియడ్ ముగిసింది...చెప్పాల్సింది వైసీపీకేనా ?
దానికి కారణం మెజారిటీ నేతలు అంతా రిలాక్స్ కావడమే అని అంటున్నారు. అంతే కాదు వైసీపీ అయిదేళ్ళ పాటు అధికారంలో ఉంది.;
హానీమూన్ పీరియడ్ టీడీపీ కూటమి ప్రభుత్వానికి ముగిసింది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేస్తున్నారు. కూటమి పాలనకు ఏడాది పాలన ముగిసింది కాబట్టి ఇక సమరమే అని అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ హానీమూన్ పీరియడ్ అని కూటమి ఏ మేరకు రిలాక్స్ అయిందో ఎవరికీ తెలియదు కానీ గత ఏడాదిగా వైసీపీ శ్రేణులు మాత్రం హానీమూన్ పీరియడ్ లోనే ఉన్నాయని అంటున్నారు.
దాదాపుగా వైసీపీ నేతలు ఎక్కడా కనిపించడం లేదని కూడా అంటున్నారు. ఈ మధ్యలో ఎన్నో పండుగలు వేడుకలు వచ్చాయి. మరెన్నో కీలక సందర్భాలు వచ్చాయి. ప్రకృతి విపత్తులు వచ్చాయి. జనాలకు ఇబ్బందులు వచ్చాయి. అయితే వైసీపీ నుంచి పరిమిత స్థాయిలోనే రియాక్షన్ వచ్చిందని గుర్తు చేస్తున్నారు
దానికి కారణం మెజారిటీ నేతలు అంతా రిలాక్స్ కావడమే అని అంటున్నారు. అంతే కాదు వైసీపీ అయిదేళ్ళ పాటు అధికారంలో ఉంది. ఎంతలా అంటే పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా వారే ప్రాతినిధ్యం వహించారు. ఇక నామినేటెడ్ పదవులు వందల్లో ఉంటే వారే తీసుకున్నారు. అలాగే ఎన్నో ప్రభుత్వ పదవులల్లో నామినేట్ అయిన వారు ఉన్నారు. మరెన్నో అవకాశాలు అందుకున్న వారూ ఉన్నారు.
అయితే వారంతా ఆ తరువాత కాలంలో ఎంతమేరకు జనంలో ఉన్నారు అన్నది ఏమైనా వైసీపీ అధినాయకత్వం పట్టించుకుందా అన్నదే చర్చగా ఉంది. అంతే కాదు చాలా మంది పార్టీ నాయకులు కీలక పదవులు అనుభవించిన వారు తన సొంత నియోజకవర్గాలలో కానే కాదు, కనీసం ఏపీలో అయినా ఉన్నారా అన్నది పార్టీ పెద్దలు ఆరా తీశారా అన్నది మరో ప్రశ్నగా ముందుకు వస్తోంది.
పార్టీ అధికారంలో ఉన్నపుడే ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ క్యాడర్ కి మధ్య బంధం తగ్గింది, గ్యాప్ బాగా పెరిగింది. గత ఏడాది కాలంగా అది ఇంకా ఉధృతం అయింది తప్ప మరేమీ లేదని అంటున్నారు. చాలా నియోజకవర్గాలలో ఇంచార్జిలను నియమించినా వారు ఏ మేరకు పనిచేస్తున్నారు. ఎంత వరకూ పార్టీ క్యాడర్ కి అందుబాటులో ఉంటున్నారు అన్న డేటా ఏమైనా పార్టీ పెద్దల వద్ద ఉందా అన్న చర్చ కూడా ఉంది.
ఇక కూటమి పేరుతో మూడు పార్టీలకు చెందిన నాయకులు ప్రతీ నియోజకవర్గంలో పొలిటికల్ గా డామినేట్ చేస్తూంటే కేసుల పేరుతో అద్నుబాటులో ఉన్న వైసీపీ క్యాడర్ ని వేధిస్తూంటే కూడా ఎంత మంది పట్టించుకున్నారు అన్న చర్చ వస్తోంది. ఆఖరుకు పరిస్థితి ఎలా ఉంది అంటే పండుగలకు పబ్బాలకు వైసీపీ పార్టీ తరఫున ఒక ఫ్లెక్సీ కట్టి జనాలకు శుభాకాంక్షలు చెప్పే నాయకుడు నాధుడు లేని నియోజకవర్గాలు ప్రాంతాలు అనేకం ఏపీలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
అలాంటిది వైసీపీ హానీమూన్ మూడ్ లో ఉందా లేక కూటమి ఉందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. నిజానికి చూస్తే కూటమి యాక్టివ్ గానే ఉంది. వారేమీ హానీమూన్ అని ఏదీ ఎక్కడా రిలాక్స్ కాలేదు. దూకుడుగానే రాజకీయం చేస్తూ వస్తున్నారు. ప్రతీ అవకాశాన్ని అందుకున్నారు. స్థానిక సంస్థలని మొత్తానికి మొత్తం వైసీపీ నుంచి తీసుకున్నారు. ఈ రోజున వైసీపీకి ఎక్కడ చూసినా అధికారమే లేదు. పైగా పార్టీ పరంగా కూడా అయితే చురుకుదనం లేదు. పార్టీ ఈ మధ్యలో ఇచ్చిన అనేక పిలుపులు నిరసన కార్యక్రమాలు కానీ అన్నీ కూడా వైసీపీ నేతల దాకా తాకలేదని కూడా విశ్లెషణలు ఉన్నాయి.
ఇక అధినేత జగన్ అయితే హానీమూన్ పీరియడ్ ముగిసింది అని చెప్పాల్సింది కూటమికి కాదని అంతకంటే ముందు వైసీపీకే అని అంటున్నారు. వైసీపీ ని నిద్రావస్థ నుంచి మేలుకొలిపి జనంలో ఉంచితేనే పార్టీకి రెండవ ఏడాది అయినా గ్రాఫ్ పెరుగుతుంది అని అంటున్నారు. అధికార పక్షానికి సహజంగానే ఏడాది పాలన తరువాత ఎంతో కొంత వ్యతిరేకత రావడం తధ్యమని దానినే కొలమానంగా తీసుకుని మేము అధికారంలోకి వచ్చేస్తున్నామని అనుకుంటే పొరపాటే అంటున్నారు.
కూటమి పట్ల ఆగ్రహం ఉంటే అది వైసీపీకి అనుకూలంగా మారాలని ఏ రాజకీయ శాస్త్రంలోనూ లేదని అంటున్నారు. జనాలకు కూటమి పట్ల వ్యతిరేకతను పెంచడం కాదు, తమ పార్టీ పట్ల అనుకూలత పెంచుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు. అంటే వైసీపీకి చాన్స్ ఉండొచ్చని అని పేర్కొంటున్నారు.