లోకేశ్ Vs జగన్ : టీవీలో కనబడదా? వైసీపీ బాస్ సెటైర్లు!!

గత ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు మంత్రి నారా లోకేశ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనను తప్పుబడుతూ వైసీపీ ఆ మరునాడే ఎక్స్ వేదికగా విమర్శలు సంధించింది.;

Update: 2026-02-19 12:30 GMT

మంత్రి నారా లోకేశ్ విమాన ప్రయాణాలపై వైసీపీ మాటల యుద్ధం మరింత తీవ్రం చేసింది. గత ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు మంత్రి నారా లోకేశ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనను తప్పుబడుతూ వైసీపీ ఆ మరునాడే ఎక్స్ వేదికగా విమర్శలు సంధించింది. దీనికి మంత్రి నారా లోకేశ్ సైతం పుష్ప స్టైల్ లో కౌంటర్ అటాక్ చేశారు. ఇక ఈ అంశంపై కలగజేసుకున్న మాజీ సీఎం జగన్మోహనరెడ్డి కూడా మంత్రి లోకేశ్ పై విమర్శలు చేయడమే కాకుండా సెటైర్లు వేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ మంత్రి లోకేశ్ విమాన ప్రయాణాలతోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పైనా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే ముగ్గురు నేతలు విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మంత్రి నారా లోకేశ్ కొలంబో పర్యటనపై మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సెటైర్లు వేశారు. రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్, ఆయనకు మద్దతు ఇస్తున్న పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. అందరూ గాల్లోనే తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరోపూట హైదరాబాద్ లో ఉంటాడు. ఇంకోపూట క్రికెట్ మ్యచ్ కోసం కొలంబో వెళ్తాడు. మళ్లీ మరుచటి రోజు విజయవాడ వస్తాడు. మళ్లీ సాయంత్రం ఢిల్లీ వెళతాడు. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి జల్సాలు చేస్తారా?’’ అంటూ జగన్ ప్రశ్నించారు.

క్రికెట్ అభిమానివే కావొచ్చు అందుకోసం కొలంబో వెళ్లాలా? టీవీలో చూస్తే కనబడదా? నేను కూడా టీవీలోనే మ్యాచ్ చూశా అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై గత మూడు రోజులుగా వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మంత్రి లోకేశ్ విమానాల్లో తిరగడాన్ని ప్రశ్నిస్తోంది. వైసీపీ అనుకూల మీడియా సాక్షి టీవీలో కూడా లోకేశ్ విదేశీ పర్యటనపై కథనాలు వెలువడ్డాయి. జనం సొమ్ముతో జల్సాలు అంటూ సాక్షిలో కథనం ప్రసారం చేయగా, ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఆ కథనాన్ని ఖండించింది. కొలంబో లో జరిగిన భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ కి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ ధనం వెచ్చించి వెళ్లారనే వార్త లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఇదే అంశంపై మంత్రి నారా లోకేశ్ సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా? వైఎస్ జగన్’’ అంటూ మాజీ సీఎంను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు మంత్రి లోకేశ్.

మంత్రి వివరణ ఇచ్చినా వైసీపీ మాత్రం వెనక్కి తగ్గలేదని తాజాగా జగన్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయని అంటున్నారు. టీవీ మ్యాచ్ చూసేందుకు లోకేశ్ కొలంబో వరకు వెళ్లాలా? అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక గురువారం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల దాడి కొనసాగించారు. మోసానికి షర్ట్, ప్యాంట్ వేస్తే చంద్రబాబులా ఉంటారని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన 3 బడ్జెట్‌లలో ప్రజలకు చేసిన మేలు ఏంటని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి ఎగిరిపోయాయన్నారు. తప్పుడు లెక్కలతో తన డప్పు తానే కొట్టుకున్నారని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో అబద్ధాలను రక్తికట్టించి అన్ని వర్గాలను మోసం చేశారని ఫైరయ్యారు. చంద్రబాబు పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ వీక్ అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News