పింగళి వెంకయ్య స్మరణ సరే...వంగవీటి రంగాను తలుచుకోరా వైఎస్ జగన్?
జగన్ సీఎం అయినాక కానీ, ఓడిపోయిన తర్వాత కానీ ఆరుసార్లు రంగా జయంతి జరగ్గా ఒక్కసారి కూడా ఆయన రంగాకు నివాళి అర్పించలేదు.;
ఆయన వారసులు పార్టీలో ఉంటే ఒకలా.. పార్టీ వీడి వెళ్లిపోతే మరోలా..? ఒకసారి ప్రజల నాయకుడిగా గుర్తించినప్పుడు అదే ఎప్పటికీ ఉంటుంది కదా..? తాజాగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు దీనిపైనే ప్రశ్న లేవనెత్తుతోంది.
చనిపోయి 37 ఏళ్లు అవుతున్నా ఏపీలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను ఇప్పటికీ పెద్ద మాస్ లీడర్ గా, పేదల కోసం పోరాడిన నాయకుడిగా కులమతాలకు అతీతంగా గుర్తిస్తారు. రంగా వారసుడు రాధాక్రిష్ణ తొలుత కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా.. ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ మీదుగా టీడీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికలకు ముందు రాధా తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయినా ఆయన వెనక్కుతగ్గలేదు. ఆరేళ్లుగా పార్టీలో పదవులు లేకున్నా.. నాయకత్వం మీద నమ్మకంతో కొనసాగుతున్నారు. ఇక సరిగ్గా 2019 ఎన్నికల వరకు రాధా వైఎస్సార్సీపీలో ఉన్నారు. దీనికిముందు ఆయన వైఎస్ జగన్ చేసిన పాదయాత్రలోనూ పాల్గొన్నారు. ఆ సమయంలోనే వంగవీటి రంగా జయంతి వచ్చింది. దీంతో జగన్ స్వయంగా రంగా చిత్రపటానికి నివాళి అర్పించారు. కానీ, రాధా పార్టీ మారడంతో అంతా మారిపోయింది.
జగన్ సీఎం అయినాక కానీ, ఓడిపోయిన తర్వాత కానీ ఆరుసార్లు రంగా జయంతి జరగ్గా ఒక్కసారి కూడా ఆయన రంగాకు నివాళి అర్పించలేదు. వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గరి వ్యక్తి రంగా. ఈ ఇద్దరూ టీడీపీ హవాలో కోస్తా జిల్లాల్లో కాంగ్రెస్ పటిష్ఠానికి పాటుపడ్డారు. వైఎస్ స్వయంగా రంగా చేసిన పోరాటాల్లో పాల్గొన్నారు. రంగా హత్య తర్వాత వైఎస్ ఆయన వర్గాన్ని ప్రోత్సహించారు. ఇక రాధాకు 2004లో కాంగ్రెస్ టికెట్ ఇప్పించారు. అలాంటి వంగవీటి రంగాను వైఎస్ జగన్ స్మరించకపోవడం అభిమానులను బాధించింది.
జూలై 4 జాతీయ పతాక రూపకర్త అయిన పింగళి వెంకయ్య జయంతి. స్వాతంత్ర్య సమరయోధుడైన ఆయనను స్మరిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కానీ, తన తండ్రి సమకాలీకుడు, ఒకప్పుడు తన పార్టీలో ఉన్న నాయకుడి తండ్రి, పేదల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి రంగాను మాత్రం స్మరించకపోవడం గమనార్హం.