జాతీయ రాజకీయాలపై జగన్ ఫోకస్.. మమతా బెనర్జీకి ట్వీట్ తో మొదలు!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి జాతీయ రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.;

Update: 2026-01-05 10:08 GMT

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి జాతీయ రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉంటున్న జగన్ ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మాత్రం దూరంగానే ఉంటున్నారు. అయితే బీజేపీతో స్నేహ సంబంధాలపై ఆయనకు వేరే ఆలోచన లేకపోయినా, ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమి ఏపీలో తనను ఓడించడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో విభేదించే పరిస్థితి లేకపోయినా, సమయం వస్తే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నుంచి తన సత్తా ఏంటో బీజేపీ పెద్దలకు తెలియజేయాలనే ఆలోచనతో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎక్కువగా ఏపీ రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే వైసీపీ బాస్ జగన్ తాజాగా చేసిన ట్వీట్.. జాతీయ రాజకీయాలపై ఆయన ఆలోచన మారనుందా? అనే చర్చకు దారితీసినట్లు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుట్టిన రోజు సందర్భంగా జగన్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రత్యేకమైన విశేషం, విషయం ఏమీ లేకపోయినా మమతకు జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం వెనుక ఇంకేదో కారణం ఉండి ఉంటుందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో రాజీ లేని పోరాటం చేస్తున్న మమతతో దోస్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇవ్వడమే జగన్ ట్వీట్ వెనుక ఆంతర్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు గెలిచిన మమతా బెనర్జీని ఈ సారి ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల నాడే బీజేపీ బెంగాల్ సీఎం దీదీ మమతాకు గట్టి పోటీ ఇచ్చింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో బెంగాల్ లో కాషాయ జెండా ఎగరవేసేలా కదన కుతూహలంతో కదులుతోంది. సీనియర్ నాయకురాలైన మమతా జాతీయస్థాయిలో తమకు కంట్లో నలుసులా తయారయ్యారని భావిస్తున్న కమల నాథులు, వచ్చే ఎన్నికల్లో మమతను ఓడించాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమితో గతంలో జట్టు కట్టిన దీదీ.. ఆ కూటమి పనితీరుపై సంతృప్తిగా లేరని అంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో తృతీయ కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్న మమత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వంటివారు మూడో కూటమి కట్టి ప్రస్తుతం తటస్థంగా ఉన్న బీఆర్ఎస్, వైసీపీ పార్టీలను చేరదీసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇది జరిగితే బీజేపీకి ప్రత్యామ్నాయంగా జగన్ కు జాతీయ స్థాయిలో బలమైన నేతల మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ బెంగాల్ సీఎం మమతకు బర్త్ డే విసెష్ చెప్పడం చర్చనీయాంశమైందని అంటున్నారు. మమతతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఇది ఒక ప్రయత్నం అవుతుందని, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాల్సివస్తే తనకు ప్రాధాన్యం పెరుగుతుందని వైసీపీ అధినేత భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News