తిరుమలకు జగన్...మళ్ళీ తెరపైకి ఆ డిమాండ్ ?

మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమలకు రానున్నారు. ఆయన చాలా కాలం తరువాత శ్రీవారి దర్శనానికి వస్తున్నారు.;

Update: 2025-08-25 13:11 GMT

మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమలకు రానున్నారు. ఆయన చాలా కాలం తరువాత శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఖరారు అయింది అని అంటున్నారు. జగన్ తిరుమల పర్యటన కోసం వైసీపీ నేతలు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు.

గత ఏడాది పరిణామాలు :

సరిగ్గా ఏడాది క్రితం తిరుమల శ్రీవారి లడ్డూ మీద అతి పెద్ద రాజకీయ రాద్ధాంతం చెలరేగింది. అందులో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అని ఏకంగా ప్రభుత్వ పెద్దలే విమర్శలు పెద్ద ఎత్తున చేశారు. వైసీపీ మీదనే అందరూ బాణాలు ఎక్కుపెట్టారు. దాంతో వైసీపీ నాడు ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ క్రమంలో జగన్ తిరుమలకు వెళ్ళాలని అనుకున్నారు. శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా తన భక్తిని చిత్తశుద్ధిని చాటాలని అనుకున్నారు. అయితే జగన్ తిరుమల పర్యటన ప్రకటన ఆనాడు రాజకీయ రచ్చకు దారి తీసింది.

డిక్లరేషన్ మీద సంతకం :

జగన్ శ్రీవారి మీద తనకు అచంచల విశ్వాసం ఉందని చెబుతూ టీటీడీకి డిక్లరేషన్ ఇవ్వాలని దాని మీద ఆయన సంతకం చేయాలని తెలుగుదేశం బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి దాంతో అప్పట్లో తిరుపతి పరిసరాలు అన్నీ కూడా రాజకీయంగా వేడెక్కాయి. జగన్ చాలా కాలంగా తిరుమలకు వస్తున్నారు అపుడు లేని ఇబ్బంది ఇపుడు ఏమిటని వైసీపీ నాయకులు ఎదురు దాడి చేయడంతో మరింతగా రాజకీయ మంట రాజుకుంది. పోలీసుల బందోబస్తు, ఆంక్షల నడుమ తిరుమల నిలిచింది. దాంతో జగన్ చివరి నిముషంలో తన తిరుపతి పర్యటన వాయిదా వేసుకున్నారు.

ఇపుడు మళ్ళీ జగన్ :

ఈ తాజాగా వస్తున్న సమాచారం జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక జగన్ ఈ నెల 27న తిరుమలకు వస్తారు అని అంటున్నారు. ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు అని చెబుతున్నారు. అయితే జగన్ ఈసారి టూర్ సందర్భంగా డిక్లరేషన్ మీద రచ్చ జరుగుతుందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. జగన్ తిరుమల శ్రీవారి మీద తనకు విశ్వాసం ఉందని చెబుతూ టీటీడీ ఇచ్చే డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయాల్సిందే అన్న మాట వినిపిస్తోంది. జగన్ అయినా ఎవరు అయినా రూల్ అందరికీ ఒక్కటే అంటున్నారు. ముందు సంతకం ఆ తరువాతమే దర్శనం అని అంటున్నారు. మరి జగన్ ఈసారి అయినా డిక్లరేషన్ మీద సంతకం పెడతారా అన్నది కూడా చర్చగా ఉంది.

టీటీడీ పనితీరు మీద :

ఇదిలా ఉంటే జగన్ తిరుమల శ్రీవారి దర్శనం తరువాత తిరుమలలోని టీటీడీ పనితీరు మీద పరిశీలన చేస్తారు అని అంటున్నారు. హథీరాం బాబా కు చెందిన భూములను తిరుపతిలో ఓబెరాయ్ హొటెల్ నిర్మాణానికి టీటీడీ కేటాయించిందని ఇప్పటికే స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాని మీద జగన్ మాట్లాడుతారు అని అంటున్నారు. అదే విధంగా శ్రీవాణి దర్శనం టికెట్ల విషయంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా అంతా జరుగుతోంది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాంతో ఆ ఇష్యూ మీద కూడా జగన్ మీడియాతో మాట్లాడుతారు అని అంటున్నారు. మొత్తం మీద ఈ నెల 27న జగన్ పర్యటన ఏ రకమైన చర్చకు రచ్చకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News