మాకు చేతకాలేదు...జగన్ నోట కొత్త మాట

అదే సందర్భంలో తమ పార్టీ నేతల గురించి జగన్ మరో మాట కూడా అన్నారు. అధికారంలో ఉన్నపుడే కాదు ఇపుడు ఇంకా గేర్ మార్చలేదు అని ఆయన చెప్పుకొచ్చారు.;

Update: 2025-09-10 12:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాజా ప్రెస్ మీట్ లో ఒక సంచలన కామెంట్ చేశారు. అది కూడా తమ గురించి తమ పార్టీ గురించి. నిజానికి ప్రెస్ మీట్ లో చంద్రబాబు మీద కూటమి సర్కార్ మీద ఆయన నిప్పులే చెరిగారు. అదే సమయంలో తమ పార్టీ గురించి తమ గురించి కూడా ఒకింత ఆవేదనతో నిర్వేదంతో చెప్పారా అన్నట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేసారు. మేము ఎంతో అభివృద్ధి చేశాం, ఎన్నో మంచి పనులు చేశామని జగన్ ఈ సందర్భంగా చెప్పుకున్నారు. అయితే వాటిని జనాలకు చెప్పుకోవడంతో మాకు చేత కాలేదు, మా పార్టీ వారు కూడా సరిగ్గా జనంలోకి వెళ్ళి చెప్పలేకపోయారు అని ఆయన అన్నారు.

గేర్ లోకి ఇంకా రాలేదు :

అదే సందర్భంలో తమ పార్టీ నేతల గురించి జగన్ మరో మాట కూడా అన్నారు. అధికారంలో ఉన్నపుడే కాదు ఇపుడు ఇంకా గేర్ మార్చలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే తమ పార్టీ నేతలు వాస్తవాలు జనాలకు ఎప్పటికప్పుడు చెప్పి ప్రభుత్వం పనితీరు మీద జనాలకు వివరించి ఉంటే ఈ తరహా ఫలితాలు వచ్చి ఉండేవి కావు అన్నది జగన్ భావనగా ఉంది. అందుకే ఆయన మేము మంచి పనులు చేసి జనాలకు చెప్పుకోకపోవడం వల్లనే ఓటమి పాలు అయ్యామన్న అవేదన అయితే కనిపించింది.

ఏడు మెడికల్ కాలేజీలు కట్టాం :

వైసీపీ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు కట్టామని అలగ మరో నాలుగు మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉండగానే తాము దిగిపోవాల్సి వచ్చింది అని ఆయన గుర్తు చేశారు. లక్ష కోట్ల సంపదను ఈ మెడికల్ కాలేజీల రూపంలో ఏపీ జనాలకు వైసీపీ ప్రభుత్వం అందించింది అని గుర్తు చేశారు. అయితే ఈ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది అని ఆయన మండిపడ్డారు తాము మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు వెళ్ళిన వాటిని తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెస్తామని కూడా జగన్ స్పష్టంగా చెప్పారు.

ఫెయిల్ అయిన సినిమాకు సక్సెస్ సభ :

చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన దానికి అధికారంలోకి వచ్చి చేసిన దానికి పొంతన లేదని జగన్ విమర్శించారు. ఒక ఫెయిల్ అయిన సినిమాకు సక్సెస్ సభ పెడితే ఎలా ఉంటుందో అలా అనంతపురం టీడీపీ సభను పెడుతున్నారు అని ఆయన అన్నారు. సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అన్నది అందరికీ తెలుసు. జనాలకు బాగా అర్ధం అయింది అని బాబు మాత్రం బలవంతపు విజయోత్సవాల పేరుతో జనాలను మభ్యపెట్టడానికి చూస్తున్నారు అని ఆయన ద్వజమెత్తారు. ఆనాడు సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీలలో చాలా వాటిని ఎగ్గొట్టి అమలు చేసిన వాటిని కూడా అరకొరగా చూపించి చాలా మంది లబ్దిదారులకు పధకాలు లేకుండా చేసి సూపర్ హిట్ అని ఎలా అంటారని బాబుని నిలదీశారు.

బాండ్ల మీద కోర్టుకు :

ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కలసి ప్రతీ ఇంటికీ వెళ్ళి పంపిణీ చేసిన బాండ్లలో ఏవీ నెరవేరలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బాండ్ల మీద కోర్టుకు వెళ్తే న్యాయ స్థానం ఏమి చెబుతుందో చూడాలని అన్నారు. ప్రపంచంలో కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడుతూ జనాలను మభ్యపెట్టే ఘనత ఒక్క చంద్రబాబుకే ఉందని ఆయన ఎద్దేవా చేశారు తాను ఏది చెప్పినా చెల్లుతుందని ఆయన అనుకుంటున్నారు అని కానీ ఇది ప్రజాస్వామ్యం అని ప్రతీ ఒక్క దానిని జనాలు గమనిస్తున్నారు అన్నది ఆయన గుర్తుంచుకోవాలని జగన్ సూచించారు.

సోషల్ మీడియా కట్టడి మీద :

సోషల్ మీడియాను కట్టడి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని జగన్ అన్నారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి అది వస్తుందని అన్నారు. సోషల్ మీడియా విషయంలో కొన్ని సవరణలు చేయాలని చూసినా కోర్టు భావ ప్రకటన స్వేచ్చ అని అడ్డుకుందని ఆయన గతాన్ని గుర్తు చేశారు. అయినా తమ తప్పులు చెబితే వినడానికి ఎందుకు చంద్రబాబుకు అంత భయం అని ఆయన ప్రశ్నించారు. ప్రజలలో ఉన్న సమస్యలను చెప్పడానికి విపక్షం ఆందోళనలు చేయకూడదా అని జగన్ నిలదీశారు. మొత్తం మీద చూస్తే జగన్ మీడియా సమావేశంలో బాబు సర్కార్ మీద విమర్శలే కాకుండా తమ పార్టీ గురించి కూడా కొన్ని సెల్ఫ్ సెటైర్లు వేసుకున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News