పాదయాత్ర 2.0 - జగన్ రిస్క్ చేస్తున్నారా?
ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల నాడిని పసిగట్టడానికి పాదయాత్రలే సరైన మార్గమని గత రెండు దశాబ్దాల రాజకీయ చరిత్ర నిరూపించింది.
ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల నాడిని పసిగట్టడానికి పాదయాత్రలే సరైన మార్గమని గత రెండు దశాబ్దాల రాజకీయ చరిత్ర నిరూపించింది. కానీ, ఒకసారి పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన నాయకుడు మళ్లీ పాదయాత్రకు సిద్ధమవడం గత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రం పాదయాత్ర 2.0కు సిద్ధమవుతున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. గతంలో జగన్ రెడ్డిని సీఎం చేసిన పాదయాత్ర మళ్లీ విజయతీరాలకు చేర్చుతుందా? అన్నదే ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు ఏ నేత కూడా రెండోసారి పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. కానీ, తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవడంపై ఆసక్తికరంగా మారింది. అధికారాన్ని శాసించే ఒక శక్తివంతమైన సాధనంగా పాదయాత్రను జగన్ రెడ్డి భావిస్తుండటంతో ఆయన 2.0 పాదయాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు.
పాదయాత్రతోనే అధికారమా?
తెలుగు నేలపై పాదయాత్రలు చేసిన నలుగురు నాయకులు అనూహ్యమైన విజయాలను అందుకున్నారు. 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించింది. ఆ తర్వాత, 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన యాత్ర, ఆ పార్టీని అధికారం వైపు నడిపించింది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టింది. అలాగే, 2024 ఎన్నికలకు ముందు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర, టీడీపీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించింది. ఈ చరిత్రను గమనిస్తే, పాదయాత్రల ప్రభావం నాయకుడిపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పెంచడంలో ఎంతగా దోహదపడుతుందో స్పష్టమవుతుందని అంటున్నారు.
వైఎస్ జగన్ 'పాదయాత్ర 2.0' వ్యూహం
ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి.. పార్టీని మళ్ళీ గెలుపు బాట పట్టించడం జగన్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. క్యాడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, నియోజకవర్గాల్లో పట్టు సాధించడానికి జగన్ తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒకటిన్నర ఏళ్ల పాటు సాగే ఈ భారీ పాదయాత్ర, రాబోయే ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడమే కాకుండా, ప్రజలతో ఉన్న దూరాన్ని తగ్గించుకోవడానికి ఆయన వేస్తున్న బలమైన అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండోసారి యాత్ర ముందున్న సవాళ్లు
అయితే, రెండోసారి పాదయాత్ర చేయడం అనేది కత్తి మీద సాము వంటిదని పరిశీలకులు భావిస్తున్నారు. గత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, ఎవరూ రెండోసారి పాదయాత్ర చేసి అధికారాన్ని దక్కించుకున్న దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర ఎంతవరకు ఫలితం ఇస్తుందనేది ఆ పార్టీలో విస్తృత చర్చగా ఉందని అంటున్నారు. అంతేకాకుండా గతంలో వైఎస్సార్, జగన్, చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు పాలకపక్షంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉండేదని గుర్తు చేస్తున్నారు. ఆ వ్యతిరేకతను ఈ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోగలిగారని చెబుతున్నారు. మరి 2028 నాటికి జగన్ పాదయాత్ర నాటికి ఇటువంటి పరిస్థితులు వస్తాయా? లేవా? అన్నదే ఉత్కంఠ రేపుతోంది. ఇదేసమయంలో ఇప్పటికే ప్రజలు జగన్ పాలనను ఒకసారి చూసినందున ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిలో పాదయాత్ర చేయడం ఎంతవరకు ఫలిస్తుందనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.