మంచి ఆలోచన ని చెప్పినా బాబు ఊహూ...జగన్ మార్క్ సెటైర్లు!
మావిగాన్ అనంది వైసీపీ సంధిస్తున్న పొలిటికల్ గన్ గా మారుతోందా అంటే పరిస్థితులు చూస్తే అలాగే ఉంది అని అంటున్నారు.;
మావిగాన్ అనంది వైసీపీ సంధిస్తున్న పొలిటికల్ గన్ గా మారుతోందా అంటే పరిస్థితులు చూస్తే అలాగే ఉంది అని అంటున్నారు. ఈ నెల 1న జగన్ గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టారు, అందులో ఎక్కడా మావిగాన్ అన్న మాట లేదు. కానీ ప్రెస్ మీట్ చివరిలో ఆయన మావిగాన్ అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. అదే పెద్ద రాజకీయ రచ్చకు చర్చకు కారణం అవుతోంది. అక్కడి నుంచి గత వారం రోజులుగా మావిగాన్ అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. కూటమి నుంచి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. సరిగ్గా వారం తరువాత మళ్లీ జగన్ వచ్చారు. ఆయన పార్టీ మీటింగులో మాట్లాడుతూ ఈసారి మావిగాన్ మీద మరింత గట్టిగా స్పష్టంగా తన వాణిని బాణిని వినిపించారు.
నానా యాగీ అంటూ :
ఏపీలో రాజధాని ఒకటి ఉండాలయ్యా బాబూ అని తాను చెప్పుకొచ్చాను అని జగన్ అన్నారు. విశాఖలో అయితే రెడీ మేడ్ రాజధాని ఉందని చెబితే నానా యాగీ చేశారు అని ఆయన విమర్శించారు. పోనీ అది కాదు అనుకుంటే మావిగాన్ ప్రతిపాదన అయినా చూడు అని ప్లాన్ బీ కూడా చెప్పాను అని జగన్ అన్నారు. ఇక్కడైనా అభివృద్ధి చేయ్ లేకపోతే అసలు రాజధాని అయినా లేకుండా పోతుందయ్యా అని చెప్పినా బాబు అసలు వినడం లేదని జగన్ అంటున్నారు. మచిలీపట్నం లో మేము పోర్టు కట్టామని జగన్ చెప్పుకున్నారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు డెబ్బై కిలోమీటర్లు, అక్కడ నుంచి గుంటూరుకు నలభై కిలోమీటర్లు మొత్తం 110 కిలోమీటర్ల పరిధిలో రాజధాని వస్తుందని జగన్ అన్నారు. పోర్టు ఎటూ ఉంటుంది, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా ఉంది మంచి రాజధాని అవుతుందని జగన్ అన్నారు. మావిగన్ అని చెప్పి ఎకనామిక్ కారిడార్ అవుతుందని బాబుకు గట్టిగా చెబుతున్నాను అని జగన్ అన్నారు. అమరావతిలో పెట్టే మొత్తం డబ్బులలో అందులో పది శాతం ఖర్చు పెట్టి మావిగన్ కడితే పిల్లలకు ఉద్యోగాలు కూడా అందులోనే వస్తాయని జగన్ అన్నారు.
గ్రోత్ ఇంజన్ తయారవుతుంది :
ఒక బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది గ్రోత్ ఇంజన్ అవుతుందని చిలకకు చెప్పినట్లుగా చెప్పినా బాబు ఊహూ అంటున్నారు అని జగన్ సభలో అభినయించి చూపడం విశేషం. ఎంత బాగా చెప్పినా ఎంత లౌక్యంగా ఎందుకు వద్దు అంటే అక్కడ రెండు లక్షల కోట్ల దాకా లోన్లు అంటూ కమిషన్లు అంటూ జగన్ నవ్వుతూ చిటికెలు వేసి మరీ అభినయించారు. ఏపీ రాజధాని విషయంలో బాబు తప్పు చేస్తున్నారు అని జగన్ ఫైర్ అయ్యారు.
ఏపీకి రాజధాని లేదు :
ఈ రోజుకు కూడా ఏపీకి రాజధాని లేదని జగన్ అన్నారు. ఇంకా ఇరవై ఏళ్ళ తరువాత కూడా మన పరిస్థితి ఏమిటి అంటే అపుడు కూడా రాష్ట్రానికి రాజధాని కనిపించదు బాబూ అని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. మూడు రాజధానులు మంచి ఆలోచన అని జగన్ మరోసారి సమర్ధించుకున్నారు. విశాఖ పైసా ఖర్చు పెట్టనవసరం లేని రాజధాని అని అన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని అన్నది రాయలసీమకు హైకోర్టు హామీ ఇచ్చామని గుర్తు చేశారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని కూడా చెప్పామని అన్నారు. కానీ బాబుకు అది నచ్చలేదని జగన్ విమర్శించారు. ఏపీకి రాజధాని విషయంలో జగన్ బాబుని ఉద్దేశిస్తూ ఈ విధంగా తొలిసారి మాట్లాడారు అనుకోవాలి. మావిగాన్ ని సమర్ధిస్తూ ఆయన చేసిన ఈ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.
వందేళ్ళు అయినా "
మరో వైపు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అయితే వంద ఏళ్ళు అయినా అమరావతి రాజధాని పూర్తి కాదని విమర్శించారు. జగన్ మావిగన్ అంటూ చెప్పగానే కూటమి ప్రభుత్వానికి ఉలుకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఒక విధంగా ప్రభుత్వానికి భయం పట్టుకుందని నాని హాట్ కామెంట్స్ చేశారు. మావిగాన్ నచ్చకపోతే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి కానీ రాజధాని లేకుండా ఏపీకి చేయవద్దు అని పేర్ని నాని అన్నారు. గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని అయితే అందరికీ మంచిదే కదా అని ఆయన వ్యాఖ్యానించారు.