జగన్ కేటీఆర్ కాంబో...సోషల్ మీడియాలో వైరల్
సినిమాలలోనే కాదు, రాజకీయాల్లోనూ కొన్ని కాంబినేషన్లు బాగా చర్చకు వస్తాయి. సోషల్ మీడియా యుగంలో వైరల్ కూడా అవుతాయి.;
సినిమాలలోనే కాదు, రాజకీయాల్లోనూ కొన్ని కాంబినేషన్లు బాగా చర్చకు వస్తాయి. సోషల్ మీడియా యుగంలో వైరల్ కూడా అవుతాయి. అలా చూసుకుంటే ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురించిన చర్చ ఎక్కువగా జరుగుతూనే ఉంటుంది. అది పాజిటివ్ గానా లేక నెగిటివ్ గానా అన్నది పక్కన పెడితే జగన్ చుట్టూ డిస్కషన్ ఎపుడూ ఉండాల్సిందే. మరో వైపు తెలంగాణాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అయితే మంచి దూకుడు మీద ఉన్నారు. ఆయన స్పీడ్ వేరే లెవెల్ అని కూడా అంటారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అలాగే కేసీఆర్ తో జగన్ కి గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి శ్రేయస్సుని మరొకరు గట్టిగానే కోరుకుంటారు.
ముచ్చట్లు పెట్టిన వైనం :
అప్పుడెపుడో 2022లో దావోస్ లో ఏపీ సీఎం గా జగన్ తెలంగాణా నుంచి మంత్రిగా కేటీఆర్ ఇద్దారూ ఒకే వేదిక మీద కలిశారు. అలా ఇద్దరూ వేసిన భేటీ అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత మాత్రం కలిసింది అయితే లేదు. కానీ మూడున్నరేళ్ళ తరువాత ఈ ఇద్దరు నేతలూ బెంగళూరు వేదికగా కలిశారు. నాటికీ నేటికీ ఎంతో తేడా. అదేంటి అంటే జగన్ మాజీ సీఎం అయ్యారు, కేటీఆర్ మాజీ మంత్రిగా ఉన్నారు. ఈ ఇద్దరు నాయకులు విపక్షంలో ఉంటూ అధికార పక్షాన్ని నిలువరిస్తూ వచ్చే ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ తో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కేటీఆర్ బెంగళూరులో జరిగిన హార్స్ షో జంపింగ్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు. అలాగే వేదిక మీదకు వచ్చి విజేతలకు అవార్డులు అందచేశారు.
ఏమి మాట్లాడుకున్నారు :
ఇదిలా ఉంటే జగన్ కేటీఆర్ ఏమి మాట్లాడుకున్నారు అన్నదే ఇపుడు హాట్ డిస్కషన్ పాయింట్. దీని మీద సోషల్ మీడియా ఊరుకుంటుందా ఎవరికి తోచిన కధలు వారు అల్లుతున్నారు. జగన్ ఈ మధ్యనే సీబీఐ కోర్టుకు వెళ్ళారు. కేటీఆర్ మీద రేసులకు సంబంధించి కేసు ఉంది. దీని గురించే ఇద్దరు నేతలు చర్చించుకుని ఉంటారని నెగిటివ్ ట్రోల్స్ చేసేవారు డిఫరెంట్ యాంగిల్ లో స్టోరీస్ పెడుతూంటే అలా కాదు ఈ ఇద్దరు యువ నేతలు అని రెండు తెలుగు రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రులు అని వారిని ఆదరించి అభిమానించే వారు పోస్టింగులు పెడుతున్నారు.
పీక్స్ లో వైరల్ :
ఈ ఇద్దరూ ఏమి మాట్లాడుకున్నారు అన్నది పక్కన పెడితే వీరి కలయిక మాత్రం ఫోటోల రూపంలో బయటకు వచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఫ్యూచర్ సీఎం లుగా వీరిని ప్రమోట్ చేస్తున్న వారూ ఉన్నారు. ఇక ఈ ఇద్దరినీ డైనమిక్ లీడర్స్ గా కూడా పొగుడుతున్న వారూ ఉన్నారు వాటి సంగతి పక్కన పెడితే జగన్ నవ్వుతూ కేటీఆర్ తో మాట్లాడడం వేదిక మీద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో జగన్ విజేతలకు అందిస్తూంటే కేటీఅర్ పక్కన నిలబడడం వంటి ఫోటోలు అయితే అందరికీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఏపీ తెలంగాణాలలో కొత్త రాజకీయం సాగుతోంది. అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతల మధ్య అంతకు మించిన సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమ్మలోనే ఏ ఇద్దరు కలిసిన సోషల్ మీడియాకు పూనకాలే వస్తాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో జరిగిన రామోజీరావు స్మారక కార్యక్రమంలో ఇద్దరు సీఎం లు అయిన చంద్రబాబు రేవంత్ రెడ్డి కలసి ముచ్చటించుకున్నారు. ఇపుడు బెంగళూరు లో జగన్ కేటీఆర్ భేటీ అయి ఆ లోటు తీర్చేశారు అని అంటున్నారు.