సరదా కోసం యుద్ధం చేస్తావా? ఓరీ నీ ట్రంప్.. మామూలోడివి కాదు సామీ

సాధారణంగా ఎవరైనా యుద్ధం గురించి మాట్లాడాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ట్రంప్ గారు మాత్రం యుద్ధాన్ని ఏకంగా "ఎంటర్టైన్మెంట్" కిందకు చేర్చేశారు.;

Update: 2026-03-15 07:17 GMT

అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ అనే పేరు ఒక 'టెలివిజన్ రియాలిటీ షో' లాంటిది. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తాజాగా ఇరాన్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు అంతర్జాతీయ రాజకీయాలు అంటే ఒక 'వీడియో గేమ్' అనిపిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపంపై ఇప్పటికే భారీగా దాడులు చేసి అక్కడి చాలా భాగాన్ని నాశనం చేశామని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే కేవలం వినోదం కోసం కూడా మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ తమతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ వారు పెట్టిన షరతులు సరైనవిగా లేవని ట్రంప్ విమర్శించారు. ఇదే సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఇంకా బతికే ఉన్నారా అని కూడా ఆయన ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ఆ 'వినోదం' ఏంటో!

సాధారణంగా ఎవరైనా యుద్ధం గురించి మాట్లాడాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ట్రంప్ గారు మాత్రం యుద్ధాన్ని ఏకంగా "ఎంటర్టైన్మెంట్" కిందకు చేర్చేశారు. "వినోదం కోసం కూడా దాడులు చేస్తాం" అని ఆయన అన్నారంటే ఆయనకు ప్రపంచ పటం ఒక 'బోర్డ్ గేమ్' అని అర్థం చేసుకోవాలి. పాపం.. యుద్ధం అంటే ఏంటో తెలిసిన వాళ్లు ఈ మాట విని షాక్ అవుతుంటే ట్రంప్ మాత్రం రిమోట్ కంట్రోల్ పట్టుకుని దాడులను టీవీలో చూస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు.

సుప్రీం లీడర్ బతికే ఉన్నారా?

ఇక ఆయన ప్రశ్నల సెన్సే ఏంటో ఎవరికీ అర్థం కాదు. "ఇరాన్ సుప్రీం లీడర్ ఇంకా బతికే ఉన్నారా?" అని అడగడం వెనుక ఏ వ్యూహం ఉందో ఆయనకే తెలియాలి. ఇది ఒక రకమైన 'మైండ్ గేమ్' అనుకోవాలా లేక తనదైన శైలిలో కవ్వించడమా? ఆయనకు ఏది సరదా? ఏది రాజకీయం? అన్నది తెలుసుకోవడం సాధారణ రాజకీయ విశ్లేషకులకు అసాధ్యం.

యుద్ధమా? వ్యాపారమా?

ట్రంప్ గారి దృష్టిలో అంతర్జాతీయ సంబంధాలు అంటే ఒక డీల్. ఇరాన్ ఒప్పందం గురించి మాట్లాడుతూ "మాకు నచ్చినట్లు ఉంటేనే ఓకే.. లేదంటే దాడులే" అనడం చూస్తుంటే, ఆయనకు 'ప్రపంచ శాంతి' కంటే 'పవర్' ఆడే ఆటలో గెలవడమే ముఖ్యమనిపిస్తోంది.

ట్రంప్ పాత కాలం నాటి రాజకీయ నాయకులకు, ఇప్పటి టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను కలిపేసిన ఒక కొత్త 'పొలిటికల్ బ్రాండ్'. ఆయన మాటలు వింటుంటే ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఆందోళన చెందాలో అర్థం కాక ప్రపంచం తల పట్టుకుంటోంది. ఏదేమైనా ఆయనకు యుద్ధం అంటే సరదా కావచ్చు కానీ ఆ సరదా వల్ల ప్రపంచం పడే ఇబ్బందులే అసలైన 'ట్రాజెడీ'!

Tags:    

Similar News