ఏపీలో 50 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు షాక్.. కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు

ఈ నెలలో ఇప్పటికే సగం రోజులు గడిచిపోయాయి. ఇప్పటికే ఉద్యోగుల వివరాలను నమోదు చేయకపోవడంతో వచ్చే నెల జీతాలు డౌటే అంటున్నారు.;

Update: 2026-03-15 06:16 GMT

ఏపీలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ నెల జీతం ఇప్పటికీ అందలేదు. వచ్చే నెల జీతం కూడా అందే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. దీంతో సుమారు 50 వేల కుటుంబాలు ఆర్థికంగా సతమతమవుతున్నారని అంటున్నారు. ఈ నెల, వచ్చే నెలలో వరుస పండుగలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, జీతం అందే పరిస్థితి లేకపోవడంతో చిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు.

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘నిధి పోర్టల్’ విధానంతో 50 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని అంటున్నారు. ప్రభుత్వ సిబ్బంది జీతాలను ఒకే విధానంలో చెల్లించేందుకు ఈ నూతన విధానం తీసుకువచ్చారు. ‘నిధి పోర్టల్’లో ఉద్యోగుల వివరాలు, బిల్లులు సమర్పిస్తేనే జీతాలు విడుదల అవుతాయి. అయితే చాలా శాఖల అధికారులు కాంట్రాక్టు ఉద్యోగుల పూర్తి వివరాలు, క్యాడర్ స్ట్రెంగ్త, పోస్టుల సమాచారాన్ని ఇప్పటివరకు నిధి పోర్టల్ లో నమోదు చేయలేదు. దీంతో జీతాల బిల్లులు ట్రెజరీలకు చేరకపోవడం వల్ల ఫిబ్రవరి జీతాలు నిలిచిపోయాయని చెబుతున్నారు.

ఈ నెలలో ఇప్పటికే సగం రోజులు గడిచిపోయాయి. ఇప్పటికే ఉద్యోగుల వివరాలను నమోదు చేయకపోవడంతో వచ్చే నెల జీతాలు డౌటే అంటున్నారు. ప్రతినెలా 20 నుంచి 25 మధ్య జీతాల బిల్లులు ఆన్ లైన్ లో ఉంచితే, ఒకటో తేదీకి జీతాలు విడుదల చేస్తారు. అయితే ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన విధానం వల్ల ఉద్యోగుల వివరాలను అప్ లోడ్ చేయడమే పూర్తికాలేదు. ఇక బిల్లులు సబ్ మిట్ చేసే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదని అంటున్నారు. దీంతో మార్చినెల జీతం అందే పరిస్థితి ఉండదని, మే నెలలోనే జీతాలు చెల్లించే పరిస్థితి ఉందని అంటున్నారు. దీంతో చిరుద్యోగుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫిబ్రవరి జీతాలు నిలిచిపోవడం, వచ్చేనెల జీతం అందే పరిస్థితి లేకపోవడం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెలలో ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి వంటి పండుగలు ఉన్నాయి. దీంతో సాధారణ ఖర్చులకు తోడుగా పండుగ ఖర్చులు అధికంగా చేయాల్సివుంటుంది. అంతేకాకుండా ఇంటి అద్దెలు, ఈఎంఐ చెల్లింపులు ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు చేతిలో చిల్లిగవ్వలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. నిధి పోర్టల్ ను తాత్కాలికంగా పక్కన పెట్టి, పాత విధానంలో అయినా తమ జీతాలు చెల్లించాలని వేడుకుంటున్నారు.

Tags:    

Similar News