హోర్ముజ్ లో మొత్తం 24 భారత నౌకలు.. ఇప్పుడెలా ఉన్నాయంటే..?
శివాలిక్ 40 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్ లోని కాండ్లా రేవుకు సోమవారం చేరుకోనుందని చెబుతున్నారు.;
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలు స్తంభించిపోయాయి. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఇజ్రాయెల్, అమెరికా నౌకలపై దాడులు చేస్తున్నాయి. దీంతో సముద్రంలో నౌకలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రధానంగా చమురు, ఎల్పీజీ, సీఎన్జీ కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నౌకలు సముద్రంలో చిక్కుకున్నాయి. మన దేశానికి చెందిన సుమారు 24 నౌకలు హోర్ముజ్ లో ఉండిపోయాయి. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
హోర్ముజ్ లో భారత్ కు చెందిన 24 నౌకలు చిక్కుకుపోయాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో రెండు నౌకలు తిరిగి వచ్చేందుకు ఇరాన్ అంగీకరించింది. మిగిలిన 22 భారత్ నౌకలను సురక్షితంగా తెప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని మోదీ జరిపిన చర్చలు ఫలించడంతో భారత్ నౌకలు హోర్ముజ్ నుంచి వచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఈ చర్చల అనంతరం తొలిసారిగా శనివారం రెండు భారత నౌకలు హోర్ముజ్ దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి.
భారతీయ ఎల్పీజీ నౌకలు శివాలిక్, నందాదేవి హోర్ముజ్ జల సంధి నుంచి బయటపడ్డాయి. శివాలిక్ 40 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్ లోని కాండ్లా రేవుకు సోమవారం చేరుకోనుందని చెబుతున్నారు. అదేవిధంగా 52 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నింపుకుని నందాదేవి ముంబై రేవుకు బయలు దేరింది. ఈ రెండు నౌకలు రావడంతో గ్యాస్ కొరత నుంచి కాస్త బయటపడొచ్చని అంటున్నారు. ఈ రెండు నౌకలు క్షేమంగా హోర్ముజ్ నుంచి బయటపడటంతో ప్రభుత్వం మిగిలిన 22 నౌకలపై దృష్టిపెట్టిందని చెబుతున్నారు.
హోర్ముజ్ లో చిక్కుకున్న భారతీయ నౌకల్లో 6 ఎల్పీజీ, ఒకటి సీఎన్జీ, మరో 4 క్రూడాయల్ నౌకలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. వీటికి కూడా దారి ఇచ్చేందుకు ఇరాన్ అంగీకరించిందని చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఒక నౌక దేశానికి వచ్చింది. హోర్ముజ్ లో ఉన్న పరిస్థితులతో జగ్ ప్రకాశ్ అనే నౌక ఓమన్ మీదుగా ఆఫ్రికా మార్గం నుంచి భారత్ కు బయలు దేరిందని షిప్పింగ్ కార్పొరేషన్ వెల్లడించింది.
యుద్ధం కారణంగా ఎర్ర సముద్రంలో జల రవాణా నిలిచిపోయింది. ప్రధానంగా ఇరాన్ కు పట్టు ఉన్న హోర్ముజ్ జల సంధి మీదుగా నౌకలు రాకపోకలు సాగించుండా నియంత్రిస్తోంది. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ సంక్షోభం నెలకొంది. అయితే భారత్ నౌకలకు మినహాయింపు ఇస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకోవడం వల్ల మన దేశం ఊపిరి పీల్చుకుంటోంది. అయితే రెండు వారాలుగా నౌకలు నిలిచిపోవడం వల్ల దేశంలో పెట్రోలియం నిల్వలు తరిగిపోవడం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో నౌకలు తిరిగి రావడం ప్రారంభం కావడంతో ప్రభుత్వ వర్గాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి.