జగన్ వస్తున్నారు అంటే ఉండాల్సిందేనా ?
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రాక రాక హైదరాబాద్ కి వస్తున్నారు. అయితే ఆయన వస్తున్నది పూర్తిగా సొంత కార్యక్రమం.;
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రాక రాక హైదరాబాద్ కి వస్తున్నారు. అయితే ఆయన వస్తున్నది పూర్తిగా సొంత కార్యక్రమం. అది కూడా కోర్టుకు హాజరయ్యేందుకు. జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు గురువారం హైదరాబాద్ కి వస్తున్నారు. ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో ఉదయం దిగుతారని అక్కడ నుంచి నాంపల్లిలో ఉన్న సీబీఐ కోర్టులో తన కేసు విషయమై ప్రత్యక్షంగా హాజరై ఆ పని ముగిసాక తిరిగి బయల్దేరి వెళ్తారు అన్నది పార్టీ వర్గాల సమాచారం.
భారీ ర్యాలీతో :
అయితే తెలంగాణా రాష్ట్రంలో జగన్ కోసం ఒక భారీ ర్యాలీని ఏర్పాటు చేయాలని జగన్ అభిమానులకు పిలుపు ఇస్తున్నారు. జగన్ చాన్నాళ్ళకు హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి అభిమాన గణం అంతా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని జగన్ కి ఘనస్వాగతం పలకడమే కాకుండా అక్కడ నుంచి నాంపల్లి కోర్టు దాకా భారీ ర్యాలీ తీయాలని కూడా భావిస్తున్నారుట. ఇదంతా పార్టీ నాయకులు అభిమానులతో కలసి చేస్తున్నారు అని అంటున్నారు.
హడావుడి ఎందుకంటే :
జగన్ ఏపీలో ఎక్కడ పర్యటించినా కూడా ఆయన వెంట అభిమాన జనం ఉంటారు. అది ఏపీ రాజకీయ నేతగా ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎం గా జగన్ కోసం రావడం అంటే వైసీపీకి అవసరం కూడా మంచిదే అన్న అభిప్రాయం ఉంది. పైగా జగన్ ఏపీ టూర్లు వేరు, కానీ హైదరాబాద్ లో టూర్ అన్నది పూర్తిగా ప్రైవేట్ పరమైనది, కోర్టుకు సంబంధించినది. దాంతో జగన్ హైదరాబాద్ వచ్చిన ఉద్దేశ్యం ఏమిటి ఈ హడావుడి దేనికి అన్న చర్చ కూడా సాగుతోంది.
అభిమానం ఉండాలి :
రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు, వారి ఇమేజ్ ని బట్టి పెద్ద సంఖ్యలో ఉంటారు. కానీ ఏ సందర్భాలలో దానికి చూపించాలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. జగన్ కోర్టు పని మీద వస్తున్నారు ఆయన అలా వచ్చి వెళ్ళిపోయేదానికి అభిమానుల హడావుడి మంచిదేనా అన్నది కూడా ఉంది. ఇది ఏ రకమైన సంకేతాన్ని ఇస్తుంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద జగన్ కోసం అయితే భారీ ర్యాలీ తీయాలని ఫ్యాన్స్ చూస్తోంది అని అంటున్నారు.