జగన్ మళ్లీ అదే మాట.. మూడేళ్లు కళ్లు మూసుకుంటే చాలంటున్న మాజీ సీఎం
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లో ధైర్యం ఏ మాత్రం సడలలేదు. ఎన్నికలు జరిగిన 10 నెలలు అప్పుడే అయిపోయాయి.;
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లో ధైర్యం ఏ మాత్రం సడలలేదు. ఎన్నికలు జరిగిన 10 నెలలు అప్పుడే అయిపోయాయి. మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని కేడర్ కూ ధైర్యం చెబుతున్నారు మాజీ సీఎం జగన్. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన వైసీపీ అధినేత, ఈ ఎన్నికల్లో వైసీపీ నేతలు తెగువకు ఫిదా అయ్యానంటూ వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ప్రతినిధులతో మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘మీ ధైర్యం చూస్తే గర్వంగా ఉంది. 50 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 స్థానాలు గెలిచాం’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ అధికార దుర్వినియోగంతో భయపెట్టినా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తెగించి పనిచేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, వైసీపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజులు తమ పార్టీవేనంటూ చెప్పిన జగన్.. మూడేళ్లు కళ్లు మూసుకుని వేచిచూడాల్సిందిగా కేడర్ కు పిలుపునిచ్చారు.
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని తానని, తన పార్టీ నేతలు కూడా అదేవిధంగా ప్రతిక్షణం ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు తెగువతో పనిచేశారు. టీడీపీకి ఈ ఉప ఎన్నికల్లో ఎక్కడా గెలిచేంత బలం లేదు. వారికి సంఖ్యాబలం లేకుండానే పోటీపడటాన్ని జగన్ తప్పుబట్టారు. వాస్తవంగా టీడీపీ ఈ ఎన్నికలను వదిలేయాలని అభిప్రాయపడ్డారు. కానీ, పోలీసులతో భయపెట్టి, బెదిరించి ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించాలని చూసింది, కానీ తమ కార్యకర్తల పోరాటంతో 39 స్థానాలను నిలబెట్టుకున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. అధికార అహంకారంతో పోటీకి దిగిన టీడీపీది ధర్మమేనా అంటూ మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు.
తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లతోపాటు రామగిరి, కుప్పం మండలాల్లో టీడీపీకి బలం లేకపోయినా ఆయా స్థానాలకు పోటీకి దిగడం ఎంతవరకు సమంజసమని మాజీ సీఎం జగన్ నిలదీశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అన్నీచోట్లా తమ పార్టీ వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఆరుగురిని బయటపెట్టి తీసుకెళ్లారు. మిగిలిన వారిని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. తమ పార్టీకి మద్దతుగా ఉన్నవారిని ఎన్నికల కేంద్రానికి రాకుండా అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపించారు. కోరం లేకపోయినా గెలిచామని డిక్లేర్ చేయించుకున్నారని విమర్శించారు. రాష్ట్రానికి సీఎం, కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఒక చిన్న పదవి కోసం ఇన్ని దారుణాలు చేయాలా? అంటూ జగన్ నిలదీశారు.