పులివెందుల టీడీపీ విజయం.. వైసీపీ స్ట్రాంగ్ రియాక్షన్
వైసీపీ తరఫున ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మీడియాకు ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు.;
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంపై విపక్షం వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. వైసీపీ తరఫున ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మీడియాకు ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. ప్రజలు ఓట్లు వేయకుండా గెలిచామని టీడీపీ చెప్పుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన ఓటర్లను అసలు పోలింగ్ కేంద్రం వద్దకు రానివ్వలేదని, దీన్ని ఎలక్షన్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. మీరు గెలిచామని అనుకోవాల్సిందే తప్ప, ప్రజలు మాత్రం అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఇక అక్రమంగా గెలిచిన టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు. ఈ ఫలితాలపై ఎవరూ నిరూత్సాహం చెందాల్సిన అవసరం లేదని కేడరుకు ధైర్యం చెప్పారు. ‘‘ఇది నిజమైన ఎన్నిక కాదు. టీడీపీ గెలిచామని అనుకుంటోంది. ప్రజలు మాత్రం అలా అనుకోవడం లేదు’’ అంటూ అవినాశ్ వ్యాఖ్యానించారు. పులివెందుల మండల ప్రజలు ఎవరూ ఓట్లు వేయలేదు. మీరు తీసుకువచ్చిన దొంగ ఓటర్లు సైతం మీరు గెలిచారని అనుకోవడం లేదని అవినాశ్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఓటర్లను ఏజెంట్లను కనీసం పోలింగు బూతులోకి అనుమతించలేదని ఆరోపించారు.
ఓటర్లను అనుమతించని పోలింగును ఎలక్షన్ అంటారా? అని నిలదీశారు. వైసీపీ కార్యకర్తలు ఎవరూ నిరూత్సాహపడాల్సిన అవసరం లేదని, వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు అవకాశం వచ్చినప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాకుండా ఎప్పుడూ చేసిన విధంగా నిజమైన ఓటింగుతో గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు. మనం గెలిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎవరూ నిరూత్సాహ పడొద్దు, ఎవరూ బాధపడొద్దు అంటూ అవినాశ్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలను ఓదార్చారు.