షాకిచ్చేలా వైసీపీ పొలిటికల్ క్యాలెండర్ ...?
మొత్తం మీద చూస్తే సంక్షేమ, సామాజిక అభివృద్ధి హామీల అమలుతో కొత్త క్యాలండర్ ని వైసీపీ రెడీ చేసి పెట్టుకుంది.;
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ రానున్న తొమ్మిది నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. చేతిలో ఉన్న సమయం తక్కువ. ఈ ఏడాది చివరికి వస్తే పూర్తిగా ఎన్నికల మయం అయిపోతుంది. దాంతో ఏమీ చేయడానికి కూడా ఉండదు. అందుకే ఆగస్ట్ మొదలుకుని రానున్న అయిదు నెలలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది.
ఆగస్ట్ వస్తూనే మొదటి రోజున జగన్ విశాఖలో ఉంటున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించిన నేపధ్యం ఉంది. అయినా అది ఇంకా నెరవేరలేదు. ఈలోగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా విశాఖ జనాల మద్దతు పొందాలని వైసీపీ చూస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు రహేజా సంస్థ విశాఖ నడిబొడ్డున నిర్మిననున్న అతి పెద్ద మాల్ కి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. పదిహేడు వేల విస్తీర్ణంతో ఈ మాల్ ఏర్పాటు కానుంది.
ఇక ఇదే ఆగస్ట్ నెల నుంచి మొదలెడుతూ అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి జోరు పెంచనున్నారు. ఇప్పటికే జూలై 31వ తేదీతో ముగిసిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కొత్త లబ్దిదారులను జగన్ ప్రభుత్వం ఎంపిక చేసి పెట్టుకుంది వారికి కూడా పధకాలను అందించాలన్నది విధానంగా పెట్టుకుంది. ఆ విధంగా వారిని తమ ఓటు బ్యాంక్ లో కలుపుకోనుంది.
ఇక ఆగస్టులో ఉద్యోగులకు మంచి చేసే కార్యక్రమాల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. ఏపీ ఎన్జీవోల సదస్సులో ఇదే నెల 21 తేదీన జగన్ ముఖ్య అతిధిగా పాల్గొని వారికి అవసరం అయిన వరాలు ప్రకటించనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల జోనల్ విధానం మీద చర్యలు తీసుకుంటారని అంటున్నారు.
నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడానికి డీఎస్సీ నోటిఫికేషన్ ఇదే నెలలో ఇవ్వాలని చూస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఉన్న ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు ఆగస్టులో రిలీజ్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు.
ఇక ఆగస్ట్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకూ ఉన్న సమయంలో రాష్ట్రంలో పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలను రంగంలోకి దించి శంకుస్థాపనలు రాష్ట్రంలో అనేక చోట్ల చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలా ఏపీలో మొత్తం 36 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఈ అయిదు నెలలోనే చేయాలని కూడా పక్కాగా వైసీపీ ప్లాన్ వేసింది అని అంటున్నారు.
అదే విధంగా 2019 ఎన్నికల వేళ ఇచ్చిన హామీలలో పెండింగులో ఉన్న వాటి మీద కూడా ఫోకస్ పెడతారు అని అంటున్నారు. వాటిని కూడా పరిపూర్తి చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సమాయత్తం కావాలని వైసీపీ ఆలోచిస్తొంది. ఇక 2019 ఎన్నికల వేళ జగన్ సామాజిక పించన్లను 2000 నుంచి మూడు వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పారు. అందులో భాగంగా 2024 జనవరి నాటికి మూడు వేల పెన్షన్ ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే సంక్షేమ, సామాజిక అభివృద్ధి హామీల అమలుతో కొత్త క్యాలండర్ ని వైసీపీ రెడీ చేసి పెట్టుకుంది. ఈ అయిదారు నెలలు జగన్ జనంలోనే ఎక్కువగా ఉంటారని అంటున్నారు దదాపుగా ప్రతీ వర్గంలో ఎంతో కొంత సంతృప్తి ఉండేలా చేసుకోవాలని వ్యతిరేకత ఉన్న చోట తగ్గించుకోవాలన్న బహుముఖ వ్యూహాలతో వైసీపీ ముందుకు సాగుతోంది అని అంటున్నారు.