కడప ముఖ చిత్రంలో వైసీపీ హంగు పెరిగిందా.. తగ్గిందా..?
కడప నుంచి విజయం దక్కించుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. నియోజవర్గంలోనే ఉంటున్నారు.;
ఉమ్మడి కడప జిల్లాలోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిల్లిమొగ్గలు వేసినా.. కడపలో మాత్రం కొంత మేరకు పట్టునిలుపుకొనే ప్రయత్నం చేసింది. రాజంపేట అసెంబ్లీ స్థానం సహా.. రాజంపేట ఎంపీ, కడప ఎంపీ, పులివెందుల, బద్వేల్ వంటి కీలక నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇక, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉండగా..కడప ఎంపీ నియోజకవర్గంలోనే ఉంటున్నారు.
కడప నుంచి విజయం దక్కించుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. నియోజవర్గంలోనే ఉంటున్నారు. అయితే.. ఆయన కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. తన వారిని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, మిథున్‌రెడ్డి..వరుస విజయాలు దక్కించుకున్నా.. స్థానిక సమస్యలపై గతంలో కంటే.. ఇప్పుడు పెద్దగా స్పందించలేక పోతున్నారు. మద్యం కేసుతోపాటు.. తన తండ్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుర్కొంటున్న సమస్యలపై తీరికలేకుండా ఉన్నారు.
ఇక, పులివెందుల నియోజకవర్గంలో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఈ బాధ్యతలను కూడా ఎంపీ అవినాష్ రెడ్డే చూస్తున్నారు. అడపాదడపా జగన్ వస్తున్నా.. నియోజకవర్గం మొత్తంలో మాత్రం ఆయన పర్యటించలేక పోతున్నారు. దీంతో స్థానికంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పైగా.. టీడీపీ నాయకులు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. వీరిని ఎదిరించేందుకు, రాజకీయంగా ఎదురు దాడి చేసేందుకు కూడా వైసీపీ నాయకులు సాహసించ లేక పోతున్నారు.
దాసరి సుధ.. గత వైసీపీ హయాంలో ఉప ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత.. గత ఏడాది కూడా వరుసగా విజయం సాధించారు. అయితే.. ఆమె తెలివిగా ఇక్కడ పనిచేస్తున్నారు. వైసీపీలో ఉన్నా.. వివాదాలకు దూరంగా ఉంటూ.. కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ఇక్కడి సమస్యలను లిఖిత పూర్వకంగా సభ దృష్టికి తీసుకువస్తూ.. పరిష్కరించేలా ప్రయత్నం చేస్తున్నారు. జనసేనలోని కొందరు నాయకులతో కలివిడి ఉన్నట్టు వార్తలు వస్తున్నా.. పనులు చేయించుకునేందుకు ఏదో ఒకటి చేయాలని ఆమె సమర్ధించుకుంటున్నారు. మొత్తంగా కడప ముఖ చిత్రంలో వైసీపీ హవా అయితే.. పెద్దగా కనిపించడం లేదు.