రివర్స్ గేర్ లో వైసీపీ ఎమ్మెల్సీ...మ్యాటర్ సీరియస్ నా ?

గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నేత, వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం వ్యవహార శైలి మీద వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోందిట.

Update: 2026-08-03 07:43 GMT

వైసీపీలో అధినాయకత్వం మాట అంటే మాటే. రెండవ మాటకు తావు ఉండదు అని అంటారు. అఫ్ కోర్స్ ఏ రాజకీయ పార్టీ అయినా ఇదే విషయంగా ఉంటుంది. అందులోనూ ప్రాంతీయ పార్టీలలో అయితే అది మరింత ఎక్కువగా ఉంటుందని అంటారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే వైసీపీలో ఒక ఎమ్మెల్సీ స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారుట. అంతే కాదు తన అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారుట. అధినాయకత్వం తీరుకు భిన్నంగా పూర్తి రివర్స్ లో సదరు ఎమ్మెల్సీ వెళ్తున్నారు అని టాక్ అయితే ఫ్యాన్ పార్టీలో నడుస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ ఏమా కధ అంటే రాజధాని నడిబొడ్డున ఉన్న ఎమ్మెల్సీ అని అంటున్నారు.

తీరు వేరుగా ఉందా :

గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నేత, వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం వ్యవహార శైలి మీద వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోందిట. పార్టీ స్టాండ్ కి విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆయన పూర్వాశ్రమంలో పోలీస్ అధికారిగా పనిచేశారు. వైసీపీలో చేరి 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆనాడు వైసీపీ ప్రభంజనం అంతటా వీచినా ఆయన ఓటమి చెందారు. అయితే జగన్ ఆయనకు గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవిని రెండు సార్లు ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏసు రత్నం ఇటీవల కాలంలో తన టోన్ మార్చారు అని అంటున్నారు. ఆయన కూటమి నేతలతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారని ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ని పొగడడం వంటివి చేశారు. అంతే కాదు మరో సందర్భంలో జనసేన అధినేత పవన్ ని కూడా పొగిడారు అని చెప్పుకుంటున్నారు.

కూటమికి సన్నిహితమా :

ఇక గుంటూరు మేయర్ పదవి నుంచి వైసీపీ నాయకుడిని దించేసి మరీ కూటమి నేతలు పదవిని అందుకున్నారు. ఆ సమయంలో కూడా కూటమి తీరుని తప్పుపట్టకుండా సదరు ఎమ్మెల్సీ వారితో చెట్టపట్టాల్ వేశారని ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఆయన తమ పార్టీ మేయర్ పదవి పోయినా బేఫికర్ గా ఉన్నారని కూడా ఫ్యాన్ పార్టీలో చెప్పుకుంటున్నారు. అంతే కాదు నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీ క్రిష్ణదేవరాయలుతో కూడా సన్నిహితంగా ఉండడం ఆయన వరికపూడిసెల ప్రాజెక్టునకు ఎంతో కృషి చేశారని మెచ్చుకోవడం ఇవన్నీ వైసీపీ పెద్దలకు కంటగింపుగా మారాయని అంటున్నారు. ఇక ఈ మధ్యనే డిప్యూటీ సీఎం పవన్ పనితీరు సూపర్ అని కూడా ఏసురత్నం పొగిడారని అంటున్నారు.

అక్కడ కూడా అలాగే :

అదే విధంగా శాసన మండలిలో వైసీపీ తీసుకున్న స్టాండ్ కి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. గుండ్లపాడులో హత్యకు గురి అయిన టీడీపీ నేత చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం మీద వైసీపీ అభ్యంతరం తెలియచేస్తే ఉద్యోగం ఇవ్వడం సబబైన చర్య అని ఏసురత్నం చెప్పి వైసీపీ నేతలకు షాక్ తినిపించారు అని అంటున్నారు. తాజాగా జగన్ శ్రీకాకుళం పర్యటనలో మహిళా ఎస్సై మీద వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారని టీడీపీ మండిపడింది. వైసీపీ ఎమ్మెల్సీ కూడా అదే తీరున మాట్లాడడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న ఎస్సై మీద అలా చేయడం సరికాదని గట్టిగానే తప్పు పట్టారని చెబుతున్నారు. తాము మాజీ పోలీస్ అధికారిగా పోలీసు వారికి సంఘీభావం మద్దతు తెలియచేస్తున్నాను అని ఏసురత్నం ప్రకటించడం కూడా వైసీపీలో చర్చకు తావిస్తోంది. ఇలా ఆయన మాట్లాడుతూ రివర్స్ లో వెళ్తూండడం పట్ల పార్టీ పెద్దలు అయితే గుర్రుగా ఉన్నారట. ఇంతకీ ఏసురత్నం వైసీపీలో ఉంటారా లేక కూటమి వైపు వెళ్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే ఆయన పదవీ కాలం మరో ఏడాదిన్నర ఉండడంతో ఇలాగే వ్యవహరిస్తారేమో అన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News