వైసీపీ పీఏసీ మీట్...బిగ్ డెసిషన్ ?
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అత్యంత కీలకమైన సమావేశాన్ని ఈ నెల 29న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.;
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అత్యంత కీలకమైన సమావేశాన్ని ఈ నెల 29న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. పార్టీకి అతి ముఖ్యమైనదిగా ఉన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ని ఆ రోజు ఏర్పాటు చేశారు. ఈ సమావేశం మీద ఇపుడు అందరి చూపూ ఉంది. వైసీపీకి చెందిన సీనియర్లు అంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశం అజెండా చూస్తే చాలానే ఉంది అని అంటున్నారు.
వరుస భేటీలు :
వైసీపీ ఈ మధ్యనే పొలిటికల్ అఫైర్స్ కమిటీని పునర్ వ్యవస్థీకరించింది. అందులో చాలా మంది సీనియర్లు గతంలో ఉండేవారు. ఇపుడు వారి ప్లేస్ లో కొత్త వారిని చోటు ఇచ్చింది. అంతే కాదు ప్రతీ జిల్లా నుంచి కనీసం ఇద్దరికి అయినా చాన్స్ ఇచ్చింది. దాంతో పీఏసీ అంటే పార్టీలో అతి ముఖ్య నాయకుల సమాహారంగా మారింది. ఇక పీఏసీ మొదటి మీటింగ్ ని వైసీపీ ఆ మధ్యనే నిర్వహించింది. ఇపుడు మరో సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది అని వార్తలు వస్తున్నాయి. నిజానికి వైసీపీ గతంలో కూడా పీఏసీని ఏర్పాటు చేసింది కానీ మీటింగ్స్ అయితే పెద్దగా ఉండేవి కావు. ఇపుడు మాత్రం వరస భేటీలు నిర్వహిస్తున్నారు.
మ్యాటరేంటి అంటే :
దాంతో ఈసారి సమావేశం మ్యాటర్ సీరియస్ గానే ఉంటుందని అంటున్నారు. ఏపీలో అధికార కూటమి వైసీపీని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీ కీలక నాయకులు అందరి మీద కేసులు పడ్డాయి అంతే కాదు చాలా మంది అరెస్టు అయి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా లిక్కర్ స్కాం ఉంది. అది కాస్తా ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ దాకా వెళ్ళింది. దాంతో ఇక లిక్కర్ స్కాం లో జగన్ మీద కూడా కేసులు పెడతారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దాంతో ఈ కీలక సమావేశం అజెండా దాని గురించేనా అన్న చర్చ ఉంది.
పార్టీని రెడీ చేస్తున్నారా :
ఒకవేళ జగన్ అరెస్టు అయితే పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్న దాని మీద చర్చిస్తారు అని అంటున్నారు. అంతే కాదు వైసీపీ ఉద్యమ పంధా మీద కూడా చర్చ సాగుతోంది అని చెబుతున్నారు. వైసీపీ అధినాయకత్వం మీదనే గురి పెట్టి లిక్కర్ స్కాం ని కదిలించారు అని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది. గతంలో వైసీపీ అధినేత అరెస్టు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మే నెల నాలుగో వారంలోనే అరెస్టు ఉంటుందని అనుకున్నారు. కానీ అపుడు ఎందుకో ఆగింది. ఇపుడు మాత్రం జరిగి తీరుతుంది అని కూటమి నేతలు చెబుతున్నారు. దాంతో ఈ సమావేశంలో పార్టీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తుంది అని అంటున్నారు.
పీఏసీకే ముఖ్య బాధ్యతలు :
పీఏసీ ఇక మీదట వైసీపీలో కీలకం కాబోతోంది అని అంటున్నారు. జగన్ కనుక జైలుకు వెళ్ళే పరిస్థితి కనుక వస్తే వైసీపీని నడిపించే బాధ్యత మొత్తం పీఏసీ మీదనే ఉంటుంది అని అంటున్నారు. ఏ ఒక్కరి మీదనో ఆధారపడకుండా ఏ ఒక్కరికో నాయకత్వం సారధ్యం అప్పగించకుండా అంతా కలసి పనిచేసేలా పీఏసీని సిద్ధం చేస్తారని అంటున్నారు. వైసీపీ నిరసనలు కానీ ఆందోళనలు అన్నీ కూడా రానున్న రోజులలో పీఏసీ చూస్తుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో కీలక పరిణామాలు మరి కొద్ది రోజులలో చోటు చేసుకోబోతాయా అన్నది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది.