జగన్ ఉత్తరాంధ్ర వదిలేశారా ?

ఆనాటి నుంచి చూస్తే ఉత్తరాంధ్ర వైసీపీలో నిండా నిస్తేజం కనిపిస్తోంది. ఎంతో మంది నాయకులు వైసీపీకి ఉన్నా ఎవరూ బయటకు రావడం లేదు.;

Update: 2025-08-30 05:34 GMT

వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే వైసీపీలో నిండా నైరాశ్యం ఆవరించింది. 2019లో ఏకంగా 151 సీట్లు సాధించిన వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో రెండు అంటే రెండు మాత్రమే వైసీపీకి దక్కాయి. అవి కూడా విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు అందించి వైసీపీ పరువు కాపాడాయి. అంతే కాకుండా అరకు పార్లమెంట్ సీటు కూడా వైసీపీకి దక్కింది.

నిండా నిస్తేజం :

ఆనాటి నుంచి చూస్తే ఉత్తరాంధ్ర వైసీపీలో నిండా నిస్తేజం కనిపిస్తోంది. ఎంతో మంది నాయకులు వైసీపీకి ఉన్నా ఎవరూ బయటకు రావడం లేదు. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వారు ఉన్నారు. మంత్రులుగా చేసీ వారు ఉన్నారు ఇతర కీలక పదవులు అందుకున్న వారు ఉన్నారు. అయినా గడచిన పదిహేను నెలలుగా ఎవరూ నోరు విప్పడం లేదు, జోరు చేయడం లేదు అని అంటున్నారు.

పార్టీ పదవులు అలా :

ఇక వైసీపీ అధినాయకత్వం మాత్రం మాజీ మంత్రులకు సీనియర్ నేతలకు పార్టీ పదవులు ఇచ్చింది. వైసీపీలో అత్యున్నత విధాన నిర్ణయ మండలిగా ఉన్న పీఏసీలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఎక్కువ మందికి చోటు కల్పించింది. అయినా సరే ఎక్కువ మంది నేతలు ఎందుకో పట్టనట్లుగా ఉన్నారు. దీంతో ఉత్తరాంధ్రాలో వైసీపీ రాజకీయ విభవం గత కాలమేనా అన్న చర్చ వస్తోంది.

జగన్ ఫోకస్ ఎటు :

ఇదిలా ఉంటే పార్టీ ఓడిన తరువాత జగన్ పెద్దగా జిల్లాల పర్యటనలు అయితే చేయడం లేదు. ఆయన అపుడపుడు పరామర్శ యాత్రలు చేస్తున్నారు. అయితే అవి కూడా రాయలసీమ కోస్తా జిల్లాలకే పరిమితం అయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాల వైపు ఆయన కనీసంగా చూడడం లేదు అని అంటున్నారు పార్టీ భారీ ఓటమి తరువాత జగన్ ఈ వైపుగా వచ్చింది లేదని అంటున్నారు. దాంతో వైసీపీ మరింత నైరాశ్యంలో ఉంది అని చెబుతున్నారు.

కూటమి గురి ఇటే :

మరో వైపు చూస్తే టీడీపీ కూటమి ఉత్తరాంధ్ర మీద గురి పెట్టేసింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి అనేక సార్లు కూటమి పెద్దలు ఉత్తరాంధ్రాలో పర్యటిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఉత్తరాంధ్ర ఏజెన్సీలో కూడా పెద్ద ఎత్తున పర్యటిచారు. ఉప ముఖ్యమంత్రిగా అధికార కార్యక్రమాలు ప్రారంభించారు. చంద్రబాబు కూడా ఈ మధ్యనే పాడేరు వెళ్ళి ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ఏజెన్సీని వరాలు ఇచ్చారు. నారా లోకేష్ క్రమం తప్పకుండా ప్రతీ నెలా ఏదో ఒక కార్యక్రమం కోసం విశాఖ వస్తూనే ఉన్నారు. తాజాగా చంద్రబాబు పవన్ లోకేష్ ముగ్గురూ విశాఖలోనే ఉంటూ అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇది కూటమిని మరింతగా ఉత్సాహాన్ని కొత్త బలాన్ని ఇచ్చింది.

అధికారానికి దగ్గర దారి :

ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో ఇది ఐదవ వంతు. అంటే ఇరవై శాతం సీట్లు అన్న మాట. ఇక సీఎం సీటు పట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 అయితే అందులో 33 శాతం సీట్లు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. ఏ పార్టీకైనా ఉత్తరాంధ్రాలో మెజారిటీ సీట్లు దక్కితే అధికారం గ్యారంటీ అని చెప్పవచ్చు 2024లో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికారంలోకి వస్తే 2019లో వైసీపీ అత్యధిక సీట్లు సాధించి పవర్ లోకి వచ్చింది ఇక 2024లో కూటమి నూటికి 98 సీట్లు గెలిచి బంపర్ విక్టరీని సాధించింది. అలాంటి ఉత్తరాంధ్రా విషయంలో వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది అధినేత ఒక్కసారి కనుక పర్యటించి గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులను గమనిస్తే కనుక ఫ్యాన్ తిరిగి స్పీడ్ అందుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఉత్తరాంధ్ర పర్యటన ఎపుడు ఉంటుందో.

Tags:    

Similar News