బాబు సర్కార్ పై మోడీకి ఫిర్యాదు...ఫస్ట్ టైం వైసీపీ దూకుడు !

ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక మీదట మరో ఎత్తు అని వైసీపీ అధినాయకత్వం చెబుతూనే ఉంది.;

Update: 2025-07-20 03:00 GMT

ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక మీదట మరో ఎత్తు అని వైసీపీ అధినాయకత్వం చెబుతూనే ఉంది. ఏడాది పాటు హానీమూన్ పీరియడ్ గా టీడీపీ కూటమికి టైం ఇచ్చామని ఇక మీదట అలా కుదరదు అని జగన్ తన పార్టీ వారికి చెప్పారు. అంతే కాదు తాను సైతం జిల్లా టూర్లకు వెళ్తున్నారు.

ఈ నేపధ్యంలో మీడియా సమావేశాలు పెట్టి మరీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు పెద్ద ఎత్తున జగన్ చేస్తున్నారు. ఇపుడు దూకుడు మరింతగా పెంచారు. ఏపీలో బీజేపీ భాగస్వామ్యం కూడా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం మీద మొదటిసారి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వైసీపీ ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుకు ఎంచుకున్న అంశమే ఇక్కడ కీలకం. ఏపీలోని పోలీసు అధికారుల తీరుపై రెండు రోజుల క్రితం జగన్ మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు అదే సమయంలో తమ హయాంలో పనిచేసిన అధికారుల విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని వారందరికీ పోస్టింగులు ఇవ్వకుండా ఖాళీగా ఉంచిందని ఆరోపణలు గుప్పించారు. ఒక యువ ఐపీఎస్ అధికారి ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు అని ఆయన అన్నారు.

ఇపుడు ఇవే ఆరోపణలతో ఏపీలో ఏమి జరుగుతున్నదో కేంద్ర పెద్దలకు వైసీపీ తెలియచేసింది. అరకు ఎంపీ గురుమూర్తి ఈ మేరకు అన్ని వివరాలతో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను ఏపీ గవర్నర్, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపించారు.

ఇక ఈ లేఖలో ఏముంది అంటే కనుక 2024 జూన్ లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఆనాటి నుంచి ఏకంగా 199 మంది పోలీసు అధికారులకు ఎలాంటి పోస్టింగులు ఇవ్వకుండా వెయింటింగులో ఉంచిందని గురుమూర్తి ఆరోపించారు. అంతే కాదు వారికి ఇప్పటిదాకా అంటే గడచిన 12 నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని ఆయన గుర్తు చేశారు.

ఈ మొత్తం 199 మంది పోలీసు అధికారులలో నలుగురు ఐపీఎస్ అధికారులు, మరో నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అడిషనల్ ఎస్పీలు, 42 మంది డీఎస్పీలు, 119 మంది సివిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. వీరందరినీ డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఇలా ఏడాదిగా వీరికి ఏ పనీ చూపించడం లేదని కేవలం సంతకాలు చేయడమే అని గురుమూర్తి రెడ్డి తెలిపారు. ఇక వీరికి జీతాలు సైతం చెల్లించడం లేదని అన్నారు. ఇలా జీతాలు చెల్లించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 16, 21కి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇక కొన్ని క్షేత్ర స్థాయి బందోబస్తు కి నాన్ పోస్టెడ్ పోలీసులను వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు.

అయితే వీరికి ఎలాంటి అలవెన్సులు రవాణా ఖర్చులు చెల్లించకపోవడంతో సొంత డబ్బులు పెట్టుకుని ఆ పనులు చూడాల్సి వస్తోందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను కావాలని ఏపీ ప్రభుత్వం కోరుతోందని మరి వందలాదిగా ఉన్న పోలీసు అధికారులను ఇలా వెయింటింగ్ లో ఉంచడం ఏ మేరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.

ఈ పోలీసు అధికారులను వెంటనే విధులలోకి తీసుకుని పెండింగులో ఉన్న జీతాలు భత్యాలు మొత్తం చెల్లించాలని ఆయన కోరారు. మరి ఈ లేఖ మీద కేంద్రం ఏమి నిర్ణయం తీసుకుంటుందో అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఏపీలో ఉన్నది కూడా ఎన్డీయే ప్రభుత్వమే. ఫిర్యాదు చేసింది ప్రతిపక్షం వైసీపీ. మరి దీని మీద కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని వాకబు చేస్తుందా లేక ఊరుకుంటుందా అన్నది చర్చగా ఉంది. మరో వైపు రానున్న రోజులలో ఏపీ సమస్యల మీద జాతీయ స్థాయిలో పోరాడాలని కూడా వైసీపీ నిర్ణయించిందని అంటున్నారు.

Tags:    

Similar News